బీజేపీకి ఓటు వేశామని ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు నాతో చెప్పారు..కౌశిక్‌రెడ్డి సంచలన కామెంట్స్

By -  Knakam Karthik
Published on : 16 Sept 2025 4:29 PM IST

Telangana, Brs Mla Kaushik Reddy, Congress, Brs, Vice Presidential election

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బీజేపీకి ఓటు వేశామని స్వయంగా తామే తనతో చెప్పారని కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నన్ను కలిసి రేవంత్ రెడ్డి చెప్తే మేము ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశామని చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టి అందరికి చెప్పమని ముగ్గురు కాంగ్రెస్ పార్టీలు ఎంపీలు నాకు చెప్పారు . నాకు తెలిసిన కొందరు కాంగ్రెస్ మిత్రులకు ఫోన్ చేస్తే.. 15 మంది కాంగ్రెస్ ఎంపీలు అమ్ముడు పోయారని చెప్పారు. అందులో తెలంగాణ నుండి 8కి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు అమ్ముడు పోయారని చెప్పారు..అని కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. తెలంగాణ ఎంపీల ఓట్లు రేవంత్ రెడ్డి అమ్ముకున్నారు. కాంగ్రెస్ ఎంపీల ఓట్లు బీజేపీకి రేవంత్ రెడ్డి అమ్ముకున్నారు. కాంగ్రెస్ సీనియర్ జైరాం రమేష్ సుదర్శన్ రెడ్డికి 315 ఓట్లు పడ్డాయని ట్వీట్ చేశారు. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు మాత్రమే పడ్డాయి. 15 ఓట్లు ఎటువెళ్ళాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎనిమిది మంది ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థికి ఓట్లు వేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయ్యాక మేము బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేశామని కాంగ్రెస్ ఎంపీలు నిర్మలా సీతారామన్ ను కలిశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. తెలంగాణ కాంగ్రెస్ 8మంది ఎంపీలు లోక్ సభ స్పీకర్ ను కలిశారు. క్రాస్ అయిన 15 ఓట్లలో 8మంది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లు ఉన్నాయి. తెలంగాణకు రేవంత్ రెడ్డి ద్రోహం చేశారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుతో లింక్ పెట్టుకుని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లు అమ్ముకున్నారు..అని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story