ప్రశ్నిస్తూనే ఉంటా.. సీఐడీ నోటీసుల‌పై పాడి కౌశిక్ రెడ్డి రియాక్ష‌న్‌

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

By -  Medi Samrat
Published on : 31 March 2026 12:51 PM IST

ప్రశ్నిస్తూనే ఉంటా.. సీఐడీ నోటీసుల‌పై పాడి కౌశిక్ రెడ్డి రియాక్ష‌న్‌

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్‌లోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 29వ తేదీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సమ్మక్క-సారక్క జాతర వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ సమయంలో జరిగిన గొడవ నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉన్నతాధికారి పట్ల అగౌరవంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ విష‌య‌మై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పత్రికా ప్రకటన ద్వారా స్పందించారు.

ప్ర‌క‌ట‌న‌లో.. ఏ తప్పు చేయకపోయినా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నాకు, నా కుటుంబానికి, మా BRS కుటుంబ సభ్యులకు CID నోటీసులు ఇవ్వడం ఎంతో బాధ కలిగించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతో నా కుటుంబ సభ్యులను, మా BRS కుటుంబ సభ్యులను ఇలా బెదిరింపులకు గురిచేయడం తగునా? అని ప్ర‌శ్నించారు. రాజకీయాలు నాపై చేయండి.. కానీ నా కుటుంబాన్ని, మా BRS కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం.? అని ప్ర‌క‌ట‌న ద్వారా అడిగారు.

రేవంత్ రెడ్డి గారు.. నన్ను లక్ష్యంగా చేసుకోండి.. నాపై కేసులు పెట్టండి.. నాకు నోటీసులు ఇవ్వండి.. కానీ నా కుటుంబాన్ని, నా BRS కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం మాత్రం బాధాకరం అన్నారు. అయినా సరే.. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ఎన్ని నోటీసులు ఇచ్చినా.. నేను వెనక్కి తగ్గను అని పేర్కొన్నారు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు.. ప్రజల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాను.. నిలదీస్తూనే ఉంటాను.. ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు.. ప్రజల కోసం చేసే బాధ్యత.. ప్రశ్నించే గొంతును అణచలేరు.. ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు.

Next Story