బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
By అంజి Published on 31 March 2024 11:36 AM IST
బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి
లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు చెందిన ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరగా.. తాజాగా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా హస్తం పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడియం కుమార్తె కావ్య కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం మారిన తర్వాత గులాబీ పార్టీ నేతలు అయోమయంలో ఉన్నారని అధికార కాంగ్రెస్‌లోకి మారాలని నిర్ణయించుకున్న స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శనివారం అన్నారు. సీనియర్ ఎస్సీ నాయకుడు తన కుమార్తె కడియం కావ్యతో కలిసి హైదరాబాద్‌లో తన సన్నిహితులతో సమావేశమై తన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సమావేశం అనంతరం శ్రీహరి విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిందని, కావ్యకు వరంగల్ లోక్ సభ టిక్కెట్టు ఇస్తామని చెప్పారని తెలిపారు.
వరంగల్ జిల్లాలో గులాబీ పార్టీ బలహీనపడిందని పేర్కొంటూ, వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు తన కుమార్తె కావ్యకు పార్టీ టిక్కెట్ ఇచ్చినా, నియోజకవర్గంలోని ఏ నాయకుడు ఆమెకు మద్దతు ఇవ్వలేదని శ్రీహరి వాపోయారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న పార్టీ తరపున పోటీ చేయడం వల్ల ప్రయోజనం లేదని కావ్య అభిప్రాయపడ్డారు.