మా జిల్లా మంత్రులు దావత్‌లకూ హెలికాప్టర్‌లో వెళ్తున్నారు: జగదీశ్ రెడ్డి

అసెంబ్లీ సమావేశాలను ఇష్టారీతిన నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు.

By Knakam Karthik
Published on : 24 March 2025 12:07 PM IST

Telangana, Brs Mla Jagadish Reddy, Congress, Ministers, Uttam, Komatireddy, Janareddy

మా జిల్లా మంత్రులు దావత్‌లకూ హెలికాప్టర్‌లో వెళ్తున్నారు: జగదీశ్ రెడ్డి

అసెంబ్లీ సమావేశాలను ఇష్టారీతిన నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఈ నెల 27 వరకు బడ్జెట్ సమావేశాలకు హాజరుకాకుండా ఆయనపై వేటు పడిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సోమవారం ఆయన అసెంబ్లీకి వచ్చారు. దీంతో సభ లోపలికి వెళ్లకుండా జగదీశ్ రెడ్డిని చీఫ్ మార్షల్ అడ్డుకున్నారు. అనంతరం జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీకి రావొద్దనడానికి ఎలాంటి ఆంక్షలు ఉన్నాయని ప్రశ్నించారు.

నన్ను ఏ కారణంతో సస్పెండ్ చేశారు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి బులెటిన్ విడుదల చేయలేదు. సస్పెండ్ చేశారో, లేదో కనీసం ఆధారాలు లేవు. బులెటిన్ ఇస్తే నేను రాను. లేదంటే స్పీకర్‌ను కలుస్తా. నేను కోర్టుకు వెళ్తానన్న భయంతో బులెటిన్ ఇవ్వట్లేదు. ఎలాంటి రాజ్యాంగ విలువలు, నిబంధనలు పాటించకుండా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అరాచకత్వానికి ఇది పరాకాష్ట. మంత్రులు జవాబివ్వలేక.. ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నారు'అని జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు.

అంతేకాదు.. నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలపై కూడా జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ‘గంట ప్రయాణానికి కూడా మా నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు హెలికాప్టర్‌లో వెళ్తున్నారు. నిన్న జాన్ పహడ్‌లో జానారెడ్డి దావత్‌కు కూడా హెలికాప్టర్‌లో వచ్చారు’ అని కీలక ఆరోపణలు చేశారు.

Next Story