బీర్లను, బార్లను నమ్ముకొని పాలన కొనసాగిస్తారా? ఇదేనా రైజింగ్?: హరీష్ రావు

రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచినట్లు జరుగుతోన్న ప్రచారంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు

By Knakam Karthik
Published on : 18 May 2025 9:15 PM IST

Telangana, Mla Harishrao, Congress Government, Liquor Prices Hike, Brs,

బీర్లను, బార్లను నమ్ముకొని పాలన కొనసాగిస్తారా? ఇదేనా రైజింగ్?: హరీష్ రావు

తెలంగాణలో మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. మద్యం ధరలు పెంచుతూ సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు ధరలు పెంచుతున్నట్లు దుకాణాలకు ఎక్సైజ్ శాఖ సర్క్యులర్లు పంపింది. క్వార్టర్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌కు రూ.20, ఫుల్ బాటిల్‌కు రూ.40 చొప్పున పెంచుతున్నట్లు మద్యం దుకాణాలకు సర్క్యులర్లు జారీ చేసింది. అయితే మద్యం రేట్లు పెంచినట్లు ఎక్సైజ్ శాఖ అధికారికంగా ప్రకటించలేదు. కాగా ఇప్పటికే బీర్ల ధరలను 15 శాతం పెంచిన విషయం తెలిసిందే.

బీర్లను, బార్లను నమ్ముకొని పాలన కొనసాగిస్తారా?: హరీష్ రావు

రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచినట్లు జరుగుతోన్న ప్రచారంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. బీర్లను, బార్లను నమ్ముకొని పాలన కొనసాగిస్తారా? మద్యం అమ్మకాలు పెంచి ఖజానా నింపుకుంటారా? ఎక్సైజ్ ఆదాయంలో తెలంగాణ రైజింగ్..ఇదేనా మీరు చెప్పిన మార్పు రేవంత్ రెడ్డి? అని హరీష్ రావు ప్రశ్నించారు. పాలన గాలికి వదిలి, సంక్షేమ పథకాలను అటకెక్కించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా ఎక్సర్‌సైజ్ చేస్తున్న డిపార్ట్‌మెంట్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఒక్కటే. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యంపై రాద్ధాంతం చేసిన వాళ్లే, మద్యం ధరలు పెంచి వేల కోట్ల రాబడిని సమకూర్చుకోవాలనుకోవడం సిగ్గుచేటు. ఇప్పటికే బీర్ల ధరలను 15 శాతం పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు లిక్కర్ ధరలు పెంచి.. పేద మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తుంది. ఒక వైపు మద్యం ధరలు పెంచడం..మరో వైపు విక్రయాలను రెండింతలు చేయాలని అధికారులను ఆదేశించడంలోనే ప్రభుత్వం ఆంతర్యం స్పష్టమవుతోంది. ఎన్నికల ముందు సుద్దపూస మాటలు..అధికారంలోకి రాగతానే అడ్డగోలుగా మధ్యం ధరల పెంపు. దివాళా అని దిక్కుమాలిన ప్రచారం చేసి రాష్ట్ర పరపతిని దిగజార్చారు. అనాలోచిత నిర్ణయాలు, దుందుడుకు చర్యల వల్ల రాష్ట్ర ఆర్థిక ప్రగతి రోజు రోజు క్షీణిస్తుండగా.. ఆ లోటును భర్తీ చేసుకునేందుకు మద్యం ధరలు పెంచడం మీకే చెల్లింది..అని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

Next Story