కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు : బీఆర్ఎస్‌

రైతు భరోసా, ప్రభుత్వ మోసాలు ప్రజల్లో చర్చ రాకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో బాగంగానే ఫార్ములా ఈ కేసు తెర‌పైకి తీసుకొచ్చార‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  7 Jan 2025 6:45 PM IST
కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు : బీఆర్ఎస్‌

రైతు భరోసా, ప్రభుత్వ మోసాలు ప్రజల్లో చర్చ రాకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో బాగంగానే ఫార్ములా ఈ కేసు తెర‌పైకి తీసుకొచ్చార‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. కేటీఆర్ నివాసం వద్ద ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు వాస్తవాలు చెబుతూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాము అందుకే కేసులు పెడుతున్నారన్నారు. నిరాధారమైన ఆధారాలతో అక్రమ కేసు పెట్టారు.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు.. మేము రైతులతో సంబురాలు చేసుకుంటే.. కాంగ్రెస్ వాళ్లు అక్రమ కేసులు పెట్టి సంబురాలు చేసుకుంటున్నారని అన్నారు. ఫార్ములా ఈ కేసులో రేవంత్ రెడ్డి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌న్నారు. చట్టాన్ని దుర్వినియోగం చేసినా.. అంతిమంగా న్యాయం గెలుస్తుందన్నారు. ఈ కేసులో కేటీఆర్ మల్లెపూవులా.. కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్య‌క్తం చేశారు. అసత్య ప్రచారాలు, అబద్ధాలు ఎక్కువ రోజులు నిలబడవన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు కేటీఆర్ శ్రమించారన్నారు.

రేవంత్ రెడ్డి విఫలమయ్యారు.. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నార‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఫార్ములా ఈ కేసు 15 నెలల క్రితం జరిగిన దానిపై కేసు పెట్టే ప్రయత్నం చేసి ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తున్నార‌ని.. రేవంత్ చిల్లర గేమ్ అడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ పెంచేందుకు కేటీఆర్ ఈ రేస్ తెచ్చారు. ఇది లొట్టపిసు కేసు.. ఓ చెత్త కేసు అని ఎద్దేవా చేశారు. ఎలాగైనా కేటీఆర్ ను ఇబ్బంది పెట్టాలని ఈ కేసు పెడుతున్నారు.. ఈ రేసు వల్ల గ్రీన్ కో కంపెనీ నష్టాలను ఎదుర్కొన్న‌ది.. ఎలక్ట్రోరల్ బాండ్స్ విషయంలోనూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్ట్రోరల్ బాండ్స్ తెచ్చుకుందని దుయ్య‌బ‌ట్టారు. సోషల్ మీడియాలో తప్పులు ప్రచారం చేస్తున్నారు.. రేవంత్ కుట్రలను ఛేదించి కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకు వస్తారన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. బీఆర్ఎస్ కార్యకర్తలు మొదలు నాయకుల వరకు ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామ‌న్నారు. లీగల్‌గా ఉన్న అప్షన్స్ ఖచ్చితంగా వాడుకుంటామ‌న్నారు. మాకు న్యాయవ్యవస్థల మీద నమ్మకం ఉందన్నారు.

Next Story