బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఆ పార్టీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. హరీశ్ రావు కూడా దీనిని ప్రోత్సహించడం కరెక్ట్ కాదని అన్నారు. కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? లేకా బీఆర్‌ఎస్ పార్టీ స్టాండా? అని ప్రశ్నించారు. వ్యక్తిగతమైతే కౌశిక్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే దానం వ్యాఖ్యానించారు. కౌశిక్ రెడ్డి ఓ బచ్చా అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే విమర్శించారు.
ఆంధ్రా సెటిలర్లపై అతడి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. దీనిపై బీఆర్‌ఎస్ అధిష్ఠానం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కౌశిక్ గతంలో మహిళా గవర్నర్‌ను కూడా అవమానించారని తెలిపారు. హరీశ్ రావు అనవసరంగా తన స్థాయి తగ్గించుకుంటున్నారని ఎమ్మెల్యే దానం వ్యాఖ్యానించారు. గాజులు వేసుకునే మహిళల శక్తి ఏంటో కౌశిక్ రెడ్డికి చూపిస్తామన్నారు. కాంగ్రెస్‌కు ఇవ్వాల్సిన పీఏసీ పదవిని గతంలో అక్బరుద్దీన్‌కు ఎందుకిచ్చారని దానం నాగేందర్ ప్రశ్నించారు.
అంతకుముందు కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లోని అరెకపూడి గాంధీ నివాసానికి ఎమ్మెల్యే దానం వెళ్లారు. తనను బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు గాంధీ ఆహ్వానించడంతోనే వచ్చినట్టు దానం తెలిపారు. సహచర ఎమ్మెల్యేగా వెళ్లినట్టు తెలిపారు. అటు దానంను గాంధీ ఇంటికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.