విద్యారంగంపై రేవంత్‌కు అవగాహన లేదు: ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

సీఎం రేవంత్ రెడ్డికి విద్యా రంగంపై అవగాహన లేదని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

By Knakam Karthik  Published on  14 Feb 2025 3:38 PM IST
Telangana, Congress Government, Cm Revanth, Brs, R.S.PraveenKumar

విద్యారంగంపై రేవంత్‌కు అవగాహన లేదు: ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

సీఎం రేవంత్ రెడ్డికి విద్యా రంగంపై అవగాహన లేదని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. విద్యారంగాన్ని కూకటివేళ్లతో పెకలించడానికేనా విద్యాశాఖ పదవిని రేవంత్ తీసుకున్నది అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఇరిగేషన్, అగ్రికల్చర్, పట్టాణాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగాలను నాశనం చేసినట్టే.. విద్యారంగాన్ని కూడా సీఎం రేవంత్ సర్కార్ నాశనం చేస్తోందని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. గురుకులాల్లో విద్యార్థులు మరణిస్తున్నా.. ప్రభుత్వ పెద్దల్లో మాత్రం చలనం లేదని ఫైర్ అయ్యారు. సిగ్గుతో తలవంచుకునేలా గురుకులాల్లో పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు.

గురుకులాల్లో ప్రవేశానికి కేసీఆర్ హయాంలో ఒక్క సీటుకు ముగ్గురు అభ్యర్థులు పోటీపడే వారని, ఇప్పుడు రేవంత్ హయాంలో ఆ పరిస్థితి తలకిందులయిందని ఆరోపించారు. గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్షకు 40 వేల సీట్లకు 80 వేల మంది కూడా అప్లయ్ చేసుకోలేదని.. మూడు సార్లు గడువు పొడిగించినా స్పందన లేదని దుయ్యబట్టారు. ప్రతిభా పాఠశాలల్లో ప్రవేశానికి ఎంట్రన్స్ టెస్టును సీఎం రేవంత్ రద్దు చేశారని విమర్శించారు. ఇప్పుడు ప్రతిభా పాఠశాలలను రద్దు చేసే కుట్ర జరుగుతోందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో గురుకులాల నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు తయారయితే.. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాల కారణంగా గురుకులాల్లో విద్యార్థులు శవాలుగా మారుతున్నారని ఆరోపించారు.

Next Story