'కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిహ్నంపై ఎందుకంత కోపం'.. సీఎం రేవంత్‌ని ప్రశ్నించిన కేటీఆర్‌

తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. కాకతీయ తోరణం, చార్మినార్‌ రాచరిక పోకడలన్న సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

By అంజి  Published on  28 May 2024 10:35 AM GMT
BRS, KTR, CM Revanth , Telangana

'కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిహ్నంపై ఎందుకంత కోపం'.. సీఎం రేవంత్‌ని ప్రశ్నించిన కేటీఆర్‌

తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. కళాకారుడు ఏలె లక్ష్మణ్‌ రూపొందించిన రాజముద్రలోని కాకతీయ తోరణం, చార్మినార్‌ రాచరిక పోకడలన్న సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాష్ట్ర గీతంలో గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్‌, కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని ఆలపిస్తున్నాం కదా అని ప్రశ్నించారు. సీఎం, కేబినెట్‌లో ఎవరికైనా జయ జయహే తెలంగాణ పాటలో ఏమున్నదో తెలుసా? అని సెటైర్లు వేశారు.

''ఇదేం రెండునాల్కల వైఖరి.. ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన.. మీకు కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం.. చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు'' అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేటీఆర్‌ ప్రశ్నించారు. అవి రాచరికపు గుర్తులు కాదని.. వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలని, వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలని కేటీఆర్‌ అన్నారు.

జయజయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా? అని సీఎం రేవంత్‌ని కేటీఆర్‌ ప్రశ్నించారు. ''అధికారిక గీతంలో కీర్తించి.. అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా..?? చార్మినార్ అంటే.. ఒక కట్టడం కాదు.. విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ కు ఐకాన్. కాకతీయ కళాతోరణం అంటే.. ఒక నిర్మాణం కాదు.. సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకం.. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి.. వీటిని తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమే. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే'' అని కేటీఆర్‌ అన్నారు.

''మీ కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాచరికరపు గుర్తులున్నాయి. మరి వాటిని కూడా తొలగిస్తారా చెప్పండి. భారత జాతీయ చిహ్నంలోనూ అశోకుడి స్థూపం నుంచి స్వీకరించిన మూడు సింహాలున్నాయి. జాతీయ పతాకంలోనూ దశాబ్దాలుగా ధర్మచక్రం ఉంది. వాటి సంగతేంటో సమాధానం ఇవ్వండి'' అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ''కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులనూ పూడ్చేస్తారా ? ఒకప్పుడు రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీని కూల్చేస్తారా ? ఇవాళ తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారు.. రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులూ చెరిపేస్తారా..?'' అని కేటీఆర్‌ నిలదీశారు.

Next Story