దొడ్డు ధాన్యానికి కూడా రూ.500 బోనస్ ఇవ్వాలి

By Medi Samrat  Published on  25 Oct 2024 9:20 AM GMT
దొడ్డు ధాన్యానికి కూడా రూ.500 బోనస్ ఇవ్వాలి

రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు రైతులకు రేవంత్ రెడ్డి ఆశ కల్పించారని.. ఇప్పుడు వరి పంట బోనస్ సన్న వడ్లకే ఇస్తామని అంటున్నారని.. రైతు రుణమాఫీ పూర్తి కాలేదని బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రత్తి పంటకు మద్దతు ధర పలకడం లేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలని.. దొడ్డు ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.రైతుబంధు మూడు పంటలకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు. రైతు భరోసా ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలన్నారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీలు ఇచ్చింది వాస్తవం కాదా.? అందుకు ప్రజలు ప్రశ్నిస్తే వచ్చిన తప్పు ఏంటి.? అని ప్ర‌శ్నించారు. ఎన్నికల ముందు సోషల్ మీడియా యూనివర్సిటీ పెట్టి బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాలన్నారు. పాలనపై కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. కుట్రపూరితంగా బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టాలని చూస్తున్నారు. పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్‌లో ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కుట్రలను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

Next Story