కారు సర్వీసింగ్‌కే వెళ్లింది.. రెట్టింపు స్పీడ్‌తో రాబోతుంది: కేటీఆర్
తెలంగాణ భవన్‌లో ఆదివారం మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 21 Jan 2024 9:15 AM GMTకారు సర్వీసింగ్‌కే వెళ్లింది.. రెట్టింపు స్పీడ్‌తో రాబోతుంది: కేటీఆర్
తెలంగాణ భవన్‌లో ఆదివారం మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా పార్టీ నేతలకు లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన పలు వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరో ఏడు లేదా ఎనిమిది స్థానాలు అదనంగా గెలిచిఉంటే తెలంగాణలో హంగ్ ఏర్పడేదని కేటీఆర్ అన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక.. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గత నవంబర్ నుంచే బిల్లులు 200 లోపు యూనిట్ల విద్యుత్ బిల్లులు కట్టొద్దని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. అయితే.. వారి మాటలనే తాను తిరిగి చెప్పాననీ.. గుర్తు చేసినందుకే తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విధ్వంసకర మనస్తత్వం అని మట్లాడుతున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు. నిజాలు మాట్లాడితే విధ్వంసకర మనస్తత్వమా అని ప్రశ్నించారు.
కరెంటు బిల్లులను తెలంగాణ ప్రజలంతా సోనియాగాంధీకే పంపుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఒత్తిడి పెంచి అమలు చేసేలా ముందుకు వెళ్దామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సమాచార హక్కును వాడుకోవాలని బీఆర్ఎస్ నేతలతో చెప్పారు. ఇక గతంలో ప్రగతిభవన్ గురించి కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారని చెప్పారు. విలాసవంతమైన సౌకర్యాలంటూ దుష్ప్రచారం చేశారని చెప్పారు. మరి ఇప్పుడు అందులో భట్టి ఎందుకు ఉంటున్నారని నిలదీశారు. కారు ప్రస్తుతం సర్వీసింగ్‌కు మాత్రమే వెళ్లిందనీ.. రానున్న రోజుల్లో రెట్టింపు వేగంతో పరుగెత్తుతుందని కేటీఆర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిద్దామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, ప్రధాని మోదీలకు భయపడే పార్టీ తమది కాదన్నారు.