అదానీ, రేవంత్‌రెడ్డి ఒప్పందాల లోగుట్టు బయటపెట్టాలి: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 8:45 AM GMTఅదానీ, రేవంత్‌రెడ్డి ఒప్పందాల లోగుట్టు బయటపెట్టాలి: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి లాంటి నాయకులను టీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో చాలా మందిని చూసిందని చెప్పారు. హైదరాబాద్, సికింద్రబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ జెండాను బొందపెడతానని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారనీ.. తెలంగాణను సాధించినందుకా? మీ దొంగ హామీలను ప్రశ్నించినందుకా అని కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కలిసిపోతాయని కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ఏక్‌నాథ్ షిండే అవుతారని చెప్పారు. రేవంత్‌రెడ్డి రక్తం అంతా బీజేపీదే అనీ.. ఇక్కడ చోటా మోదీగా రేవంత్ మారారని విమర్శించారు. గతంలో అదానీ గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఆయన కోసమే వెంటపడుతున్నారని చెప్పారు. అదానీ, రేవంత్‌రెడ్డి ఒప్పందాల లోగుట్టు బయటపెట్టాలన్నారు. ఒకపక్క రాహుల్‌గాంధీ అదానీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే, రేవంత్‌రెడ్డి మాత్రం అదానీ కోసం అర్రులు చాస్తున్నారని మాజీమంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతి హామీని అమలు చేసేవరకు రాష్ట్రంలో ప్రజలెవరూ కరెంటు బిల్లులు కట్టొద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు. కరెంటు బిల్లు ప్రతులను సోనియాగాంధీ ఇంటికి పంపాలన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్‌కు గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గృహజ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయడమే కాదు.. రెంట్‌కు ఉంటోన్న వారికి కూడా వర్తింపజేయాలన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళక రూ.2500 ఇవ్వాలన్నారు. ఇచ్చి హామీలన్నింటినీ నెరవేర్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.