వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. ఈ నెల 27న సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. మొదట పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో విచారణ కొనసాగుతుండగానే పోలీసులు అనుమతి ఇవ్వడంతో, హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను బీఆర్ఎస్ నేతలు ఉపసంహరించుకోనున్నారు. వరంగల్ కమిషనరేట్ సీపీ ఆదేశాల మేరకు కాజీపేట రూరల్ ఏసీపీ, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ సీనియర్ నేతలు పెద్ది మదుసూధన్ రెడ్డి, వినయ్ భాస్కర్ అనుమతి పత్రాలను అందుకున్నారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీ సభలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించడంతో, కోర్టుల ద్వారా అనుమతులు పొందడం జరిగింది. ఆ అనుభవం దృష్ట్యా, రజతోత్సవ సభ అనుమతుల కోసం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం పోలీసులు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో, హైకోర్టులో వేసిన కేసును బీఆర్ఎస్ పార్టీ ఉపసంహరించుకోనుంది.