సీఎం మాటలకు, చేతలకు పొంతన లేదు : తాటికొండ రాజయ్య
సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు మద్దతు ఇస్తూ.. మాలలను తెరవెనుక రెచ్చగొడుతున్నారని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు.
By Knakam Karthik
మాదిగలకు మద్దతిస్తూ,మాలలను రెచ్చగొడుతున్నారు..రేవంత్‌పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు మద్దతు ఇస్తూ.. మాలలను తెరవెనుక రెచ్చగొడుతున్నారని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయడంలేదని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించి ఆరు నెలలు గడిచిపోయింది. తీర్పు వచ్చిన రోజే సీఎం రేవంత్ రెడ్డి, ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారని అన్నారు. 100 రోజుల్లో వర్గీకరణ అమలు చేస్తామని మాటిచ్చిన ప్రధాని మోడీ కూడా.. ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని అన్నారు. తెలంగాణలో వర్గీకరణకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కొప్పుల రాజు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. మాదిగల వల్లే తాను రాజకీయంగా ఎదిగానని, ఏ వర్గం సహకరించకున్నా మాదిగలు తనకు సహకరించాలని సీఎం రేవంత్ అన్నారంటూ.. తాటికొండ రాజయ్య మాట్లాడారు. సీఎం రేవంత్ మాటలకు చేతలకు పొంతన లేదని విమర్శలు చేశారు.
మాలలను కాదని వర్గీకరణ అమలు చేస్తే సీఎం పదవి ఊడుతుందని రేవంత్ భయపడుతున్నట్లు హాట్ కామెంట్స్ చేశారు. ఆర్డినెన్స్ తీసుకువచ్చయినా నోటిఫికేషన్లలో, ఏ,బీ,సీ,డీ వర్గీకరణ అమలు చేస్తామని అసెంబ్లీలో చెప్పి రేవంత్ మాట తప్పారు. మొదటి నుంచీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది బీఆర్ఎస్ మాత్రమే. ఉద్యమంలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ ఎస్సీ వర్గీకరణకు కేసీఆర్ అండగా నిలిచారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం ప్రధాని మోడీని కలిసి ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కోరింది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉంటే, అదే పార్టీకి చెందిన వివేక్ వ్యతిరేక సభ ఎలా పెడతారని తాటికొండ రాజయ్య ప్రశ్నించారు. కమిటీల పేరుతో కాలయాపన చేయడం కాంగ్రెస్‌కు అలవాటేనని విమర్శించారు. ఫిబ్రవరి 10లోగా ఎస్సీ వర్గీకరణను అమలు చేయకపోతే బీఆర్ఎస్ తరపున కార్యాచరణ ప్రకటిస్తామని మాజీ ఎమ్మెల్యే రాజయ్య హెచ్చరించారు.