బీసీల కోసం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ బీసీల కోసం చిత్తశుద్ధితో కులగణన చేస్తుందని అన్నారు. పదేళ్లలో ధర్నా చౌక్ లేకుండా చేసి, బీసీలను విస్మరించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని కిరణ్ కుమార్ ఆరోపించారు. పదేళ్లలో బీసీలను పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటాలనే కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసిందని చెప్పుకునేందుకే ఎమ్మెల్సీ కవిత ధర్నా కార్యక్రమం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇందిరా పార్క్‌లో కాదు, కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ధర్నా చేయాలని ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చారు.
బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టే తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని ప్రకటించామని ఎంపీ కిరణ్ కుమార్ అన్నారు. హనుమంతరావు, కేశవరావు, డి.శ్రీనివాస్ లాంటి బీసీ బిడ్డలకు పెద్దపీట వేసి అధ్యక్షులను ఘనత కాంగ్రెస్ పార్టీదే అని చెప్పారు. వీలైతే బీఆర్ఎస్ పార్టీ కూడా కులగణనలో పాల్గొని, భాగస్వాములై సహకరించాలని సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించొద్దు అని ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ హితవు పలికారు.