80 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించనున్న కేసీఆర్..?
తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 80 నియోజకవర్గాలకు బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
By అంజి Published on 18 Jun 2023 9:56 AM IST
80 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించనున్న కేసీఆర్..?
తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 80 నియోజకవర్గాలకు బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభ్యర్థులను జూలై మూడో వారంలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేతకి తాజా సర్వే నివేదిక అందిందని.. నివేదిక ఆధారంగా ఆ 80 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో అభ్యర్ధుల ఎంపికలు ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు మూడింట రెండొంతుల స్థానాలకు అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎన్నికల వేళ రాబోయే సమస్యలకు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారని సమాచారం.
సర్వేలో 40% నుంచి 45% రేటింగ్ పొందిన ఎమ్మెల్యేలు 80 మంది అభ్యర్థుల జాబితాలో చోటు దక్కించుకుంటారని అంచనా. దీంతో 35% రేటింగ్ సాధించలేకపోయిన వారితో పార్టీకి తలనొప్పి ఉండే అవకాశం ఉంది. తిరుగుబాటు అభ్యర్థుల వల్ల ఏర్పడే నష్టాన్ని తగ్గించడానికి వ్యూహాత్మక చర్యగా పార్టీ అధిష్టానం ముందస్తుగా అభ్యర్థిత్వాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతర్గత కలహాలు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునేందుకు పార్టీ నాయకత్వానికి నాలుగు నెలల సమయం కూడా ఉంటుంది.
జాబితాలో చోటు దక్కని ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినా, ఆశావహులు పార్టీని వీడాలని చూసినా దిద్దుబాటు చర్యలకు వీలుంటుందనేది పార్టీ అధినేత ఆలోచనగా తెలుస్తోంది. ఎంపికైన 80 మంది అభ్యర్థులు కూడా తమతమ అసెంబ్లీ నియోజకవర్గాలపై పూర్తి దృష్టి పెట్టడానికి వీలైనంత సమయం దొరుకుతుంది. తద్వారా ప్రత్యర్థి పార్టీలను ధీటుగా ఎదుర్కొవచ్చనదే కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది.