రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వ‌డాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు.

By -  Medi Samrat
Published on : 31 Jan 2026 5:32 PM IST

రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వ‌డాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్‌ను వేధిస్తోందని, రాజకీయ వేధింపుల్లో భాగంగా ఆయనను అవమానిస్తూ అమానుషంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. టెలిఫోన్ ట్యాపింగ్ పేరిట కట్టుకథలు సృష్టించి, ఇప్పుడు సిట్ (SIT) విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడం దుర్మార్గమైన, నీచమైన వైఖరి అని అభివర్ణించారు.

రేపటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలోని 12,000 పైచిలుకు గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే ప్రతి మున్సిపల్, నియోజకవర్గ కేంద్రాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టడం ద్వారా ప్రభుత్వానికి నిరసన సెగ తగిలేలా చేయాలని పిలుపునిచ్చారు.

పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎక్కడికక్కడ తమ సొంత జిల్లాల్లోనే ఉండి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు. నిరసనలు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఉండాలని, పోలీసులతో ఘర్షణలకు తావివ్వకుండా ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించాలని కోరారు.

Next Story