శ్మశాన వాటిక కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణానికి కూడా లంచం

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అవినీతికి పాల్పడుతూ పలువురు ప్రభుత్వ ఉద్యోగులు అడ్డంగా దొరికారు.

By Medi Samrat  Published on  21 May 2024 9:19 AM IST
శ్మశాన వాటిక కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణానికి కూడా లంచం

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అవినీతికి పాల్పడుతూ పలువురు ప్రభుత్వ ఉద్యోగులు అడ్డంగా దొరికారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని కమలాపూర్‌ మండలంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో 'విరాసత్‌' భూమి రిజిస్ట్రేషన్‌ సెటిల్‌ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.5వేలు లంచం తీసుకుంటుండగా కమలాపూర్‌ తహశీల్దార్‌ మాధవి, ధరణి ఆపరేటర్‌ రాకేష్‌ సోమవారం రెవెన్యూ శాఖకు చిక్కారు. విరాసత్ కింద భూముల రిజిస్ట్రేషన్ కోసం కున్నూరు గ్రామానికి చెందిన గోపాల్ నుంచి రూ.30,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో అతడు ఏసీబీని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఏసీబీ ట్రాప్‌ వేసి అధికారులకు చెల్లించేందుకు గోపాల్‌కు ప్రత్యేక ఇంక్‌తో కూడిన కరెన్సీ నోట్లను అందించింది. వారి ఆదేశాల మేరకు గోపాల్ తహశీల్దార్ మాధవికి రూ.4వేలు, ధరణి నిర్వాహకుడు రాకేష్ కు రూ.1000 అందజేశారు. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఇద్దరు అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాకేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని విచారించారు. తహసీల్దార్ మాధవి ఆదేశాల మేరకే లంచం తీసుకున్నట్లు రాకేష్ స్పష్టం చేయడంతో ఎమ్మార్వో మాధవి, ధరణి ఆపరేటర్ రాకేష్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఇక సిరిసిల్లలో ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.7వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీరాజ్‌ శాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. శ్మశాన వాటికకు కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణానికి సంబంధించిన బిల్లు క్లియరెన్స్‌ కోసం సీనియర్‌ అసిస్టెంట్‌ జోగినిపల్లి భాస్కర్‌రావు కాంట్రాక్టర్‌ నుంచి రూ.7వేలు డిమాండ్‌ చేశారు. అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ అవినీతి అధికారులపై సంబంధిత సెక్షన్స్ కింద కేసును నమోదు చేశారు.

Next Story