హోరాహోరీగా సాగిన కౌంటింగ్..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విక్టరీ
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపొందారు.
By Knakam Karthik
హోరాహోరీగా సాగిన కౌంటింగ్..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విక్టరీ
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపొందారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో BJP అభ్యర్థి విజయం సాధించారు. చివరి వరకు హోరాహోరీగా కౌంటింగ్ కొనసాగింది. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యం పొందారు. నరేందర్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా.. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఒక వైపు కౌంటింగ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. 56 మంది అభ్యర్థులు పోటీ చేసిన కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. తొలి ప్రాధాన్యఓట్లలో ఎవరికీ కోటా ఓటు లభించక పోవడంతో ఎలిమినేషన్ పద్ధతిలో రెండో ప్రాధాన్య ఓట్టను లెక్కించి అభ్యర్థి గెలుపును ప్రకటించారు.
ఈ స్థానానికి మొత్తం 2,52,029 ఓట్లు పోల్ కాగా, 28,686 ఓట్లు చెల్లకుండా పోయాయి. చెల్లుబాటైన 2,23,343 ఓట్లలో గెలుపు కోసం 1,11,672 ఓట్లను కోటా ఓట్లుగా నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 75,675 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 70,565 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు వచ్చాయి. ఈ ముగ్గురికి కలిపి 2,06,659 ఓట్లు పోలవగా.. పోటీలో ఉన్న మిగతా 53 మందికి కలిపి 16,684 ఓట్లు పోలయ్యాయి.
దీంతో మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ కోటా ఓటు రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. ఈ క్రమంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న అంజిరెడ్డి, నరేందర్‌రెడ్డి మినహా 54 మంది ఎలిమినేట్ అయినా కోటా ఓట్లు ఎవరికి లభించలేదు. దీంతో ఆ ఇద్దరిలో అత్యధిక ఓట్లు సాధించిన అంజిరెడ్డిని విజేతగా ప్రకటించారు. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత అంజిరెడ్డి 98,637 ఓట్లతో ప్రథమ స్థానం పొందగా, నరేందర్‌రెడ్డి 93,531 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల ద్వారా అంజిరెడ్డికి అదనంగా 22,962 ఓట్లు రాగా, నరేందర్‌రెడ్డికి 22,966 ఓట్లు వచ్చాయి.