కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్​హౌజ్​కు పరిమితం చేయాలి : కిషన్​ రెడ్డి

BJP Telangana Chief Kishan Reddy Sensational Comments on KCR. ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్​ సభను సక్సెస్​ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్​ రెడ్డి కోరారు.

By Medi Samrat  Published on  7 July 2023 9:22 AM GMT
కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్​హౌజ్​కు పరిమితం చేయాలి : కిషన్​ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్​ సభను సక్సెస్​ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్​ రెడ్డి కోరారు. ఈ రోజు ఉదయం భారీ కాన్వాయ్​తో హైదరాబాద్​ నుంచి వరంగల్ చేరుకున్న ఆయన.. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రధాని సభ జరిగే ఆర్ట్స్​ కాలేజీ గ్రౌండ్​లో ఏర్పాట్లను పరిశీలించిన అనంత అక్కడే మీడియాతో మాట్లాడారు. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్​ యూనిట్​, జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రధాని భూమి పూజ చేస్తారని తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తున్నదని వెల్ల‌డించారు. తెలంగాణలో కేసీఆర్​ కుటుంబం ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూస్తున్నామ‌ని ఆరోపించారు.

కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్​హౌజ్​కు పరిమితం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఈసారీ బీజేపీని ఆశీర్వదించాలని ప్రధాని మోదీ కోరనున్నారని పేర్కొన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి సచివాలయంకు పోయే పరిపాలన కావాలని అన్నారు. బీఆర్​ఎస్​, బీజేపీ ఎప్పుడూ కలిసిన దాఖలాలు లేవు.. ఇతర పార్టీలు చేసే విషప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని అన్నారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ గతంలో అనేకసార్లు కలిశాయి. రాష్ట్రపతి ఎన్నిక సమయంలో కాంగ్రెస్​ పార్టీకి మద్దతుగా కేసీఆర్​ మాట్లాడిన విషయం గుర్తుంచుకోవాలి. అవి రెండు బొమ్మ బొరుసు పార్టీలని కామెంట్ చేశారు. గతంలో 18 చోట్ల కాంగ్రెస్ గెలిస్తే.. 12 మంది బీర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారని వివ‌రించారు.

బీజేపీ మాత్రమే కుటుంబపాలనను అంతమొందించగలదని.. బీజేపీ మాత్రమే న్యాయమైన పాలన చేయగలదని.. గత 9 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం నీతిమంతంగా పనిచేస్తున్నదని అన్నారు. మంచి ప్రభుత్వం తెలంగాణకు అందిస్తామ‌న్నారు. చాలా ఏండ్ల తర్వాత భారత ప్రధానిగా మోదీ వరంగల్​కు వస్తున్నారని వెల్ల‌డించారు. వరంగల్​ నుంచి హైదరాబాద్​ వరకు సిమెంట్​ రోడ్డు వేయించిన ఘనత ప్రధాని మోదీని కొనియాడారు.

వరంగల్​ జిల్లాకు టెక్స్​టైల్​ పార్క్​ కేంద్రమే మంజూరు చేసిందన్నారు. వరంగల్​ అభివృద్ధి విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నది. రైలు మ్యానుఫ్యాక్చరింగ్​ పరిశ్రమలో భవిష్యత్​లో రైలు ఇంజన్​ సహా.. వ్యాగన్లు, కోచ్​లు ఏమైనా తయారు చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించారు. అనుకున్నదానికంటే పెద్ద పరిశ్రమనే కాజిపేటకు వచ్చిందని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరంగల్​ ఎయిర్​పోర్టు అంశం మొదటిద‌న్నారు.

కవిత అరెస్ట్ చూడాల్సిన పని బీజేపీది కాదు. సీబీఐ పని అన్నారు. కేసీఆర్ ది కమీషన్ల ప్రభుత్వమ‌ని.. కుటుంబ వాటాలు, పెత్తనం లేని పరిపాలన తెలంగాణలో తీసుకువస్తామ‌ని పేర్కొన్నారు. మామునూర్ ఎయిర్ పోర్ట్ స్థలం విషయంలో నేను, మా అధికారులు రాష్ట్రానికి ఎన్నోసార్లు లెటర్స్ రాశామ‌ని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాగానే వరంగల్ ఎయిర్ పోర్ట్ కు మొదటి ప్రాధాన్యత ఇస్తామ‌ని పేర్కొన్నారు. ఎయిర్ జర్నీని బీజేపీ ప్రోత్సాహిస్తుందని తెలిపారు. ఓరుగల్లు జనాలు మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్మార్ట్ సిటీ, అమృత్ వంటి స్కీమ్స్ ఇచ్చాము. పీఎం మిత్ర ద్వారా మెగా టెక్స్ టైల్ పార్క్ కు కేంద్రం నిధులు మంజూరుచేసింది. రూ.550 కోట్లతో జాతీయ రహదారి అనుసంధానం చేశామ‌ని తెలిపారు. మెగా టెక్స్ టైల్ పార్క్ రావడానికి స్టేట్ తరఫున కృషి చేశానని వెల్ల‌డించారు.


Next Story