ఎన్నికల వేళ బీజేపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి దూరమవగా.. తాజాగా అధికార ప్రతినిధి అనుగుల రాకేష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వేధింపులకు గురిచేస్తున్నారని.. పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. రావు పద్మకు బీజేపీ వరంగల్ పశ్చిమ టిక్కెట్టు కేటాయించింది. రాకేష్ రెడ్డికి దశాబ్ద కాలంగా బీజేపీతో అనుబంధం ఉంది.
హన్మకొండలో ఆయన తన మద్దతుదారులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ జిల్లా నాయకత్వం తన పట్ల చాలా దారుణంగా ప్రవర్తించిందని.. తన అనుచరులను కూడా పార్టీ వేధించిందని అన్నారు. పార్టీ ఉదాసీనంగా ఉన్నప్పటికీ.. తెలంగాణ ప్రజల నుండి తనకు లభించిన విస్తృతమైన గుర్తింపు, మద్దతును గుర్తించడంలో పార్టీ విఫలమైందని అన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తుపై తన సందేహాన్ని వ్యక్తం చేశాడు. పార్టీ యువతకు ఇష్టం లేదనే భావజాలం పేరుతో యువకులను దోపిడీ చేస్తోందని ఆరోపించారు.