రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రచార ఆర్భాటమే తప్పా ఏ వర్గానికి రాష్ట్రంలో మేలు జరగలేదు.. మహిళలు, రైతులు, కార్మికులు, యువత అంతా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. కేంద్ర బడ్జెట్ లో 12 లక్షల వరకు ఇన్ కం ట్యాక్స్ మినహాయింపు చాలా విప్లవాత్మక నిర్ణయం.. దీన్ని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లాలన్నారు. పేద, మధ్య తరగతికి మేలు చేసే కేంద్ర బడ్జెట్ ను ప్రజలకు వివరించాలన్నారు.
రాష్ట్రంలో బీజేపీకి ఉన్న సానుకూల పరిస్థితుల్లో మూడుకి మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలవాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ గెలుపుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. పార్టీ శ్రేణులు అంతా.. ఇచ్చిన సెగ్మెంట్లలో పూర్తి స్థాయిలో పని చేయగలిగితే మూడుకు మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలుస్తామన్నారు. ఈ ఎన్నికలను ఆయా సెగ్మెంట్లలో ప్రతి బీజేపీ నాయకులు సవాల్ గా తీసుకొని పని చేయాలన్నారు.
రేపటి నుంచి ప్రతి జిల్లా, మండల, బూత్ స్థాయి లో వర్క్ షాప్ లు నిర్వహిస్తామన్నారు. బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి కలిసికట్టుగా పని విభజన చేసుకొని ప్రతి ఓటరును కలుసుకోవాలన్నారు. ఓటర్లను ఎన్ని సార్లు కలుస్తున్నామనేది కాదు ఆ ఓట్లను మన వైపుకు మలిచే విధంగా ప్రయత్నం చేశామన్నదే ముఖ్యం అన్నారు. బడ్జెట్ మధ్య తరగతి ప్రజలకు వారికి ఎంతో ఉపకరిస్తుంది. బడ్జెట్ గురించి ప్రజలకు అర్థమయ్యేలా వివరించే భాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలన్నారు.