టీఆర్ఎస్ కు పోటీగా ధర్నా చేస్తున్న బీజేపీ చీఫ్ బండి సంజయ్ అండ్ కో..
BJP Protest against Telangana govt over Paddy Procurement. యాసంగి వరిని కేంద్రమే కొనుగోలు చేయాలని ఢిల్లీలో టీఆర్ఎస్ దీక్ష చేపట్టగా..
By Medi Samrat Published on 11 April 2022 11:28 AM ISTయాసంగి వరిని కేంద్రమే కొనుగోలు చేయాలని ఢిల్లీలో టీఆర్ఎస్ దీక్ష చేపట్టగా.. బీజేపీ హైదరాబాద్‌లో దీక్షకు సిద్ధమైంది. 'వడ్లు కొను లేదా గద్దె దిగు' నినాదంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ డిమాండ్ చేస్తూ రైతు దీక్ష చేపట్టనుంది. ఉదయం 10 గంటలకు ఇందిరా పార్కు వద్ద చేపట్టనున్న ఈ ఆందోళనకు కేంద్ర మంత్రి వి.మురళీధరన్ హాజరవుతారని తెలిసింది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నేత రాజాసింగ్ తదితరులు ఈ దీక్షలో పాల్గొనబోతున్నారు.
ఢిల్లీలో నిరసనల పేరిట సీఎం కేసీఆర్ రాజకీయ డ్రామాలాడుతున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. వడ్లు కొంటామని కేంద్రం చెబుతున్నా, ఎందుకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రతి గింజా కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రతీ గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందంటూ ప్రచారం చేసుకున్న మీరు ఇప్పుడెందుకు ప్లేటు ఫిరాయిస్తున్నారని సంజయ్ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.
ఇక ఆదివారం నాడు వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర 14 తేదీ నుండి జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ నుండి ప్రారంభిస్తున్నామన్నారు. సుమారు 311 కిలో మీటర్లు సాగే పాదయాత్రను రంగారెడ్డి జిల్లా మహేశ్వరంతో ముగిస్తామని ప్రకటన చేశారు.