తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకుగాను ఎనిమిది స్థానాల్లో బీజేపీ విజయం సాధించడం ద్వారా రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ అని తేలిందని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిగా చూడాలని తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) ఓటు వేశారని అన్నారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు ఈటెల ధన్యవాదాలు తెలిపారు.
బీజేపీ ఓట్ల శాతం 35 శాతానికి చేరుకుందని చెప్పారు. మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలు తనవి అని గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌తో ఉంటే మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ స్థానాలను ఎందుకు గెలవలేకపోయారో రేవంత్ రెడ్డి చెప్పాలని అన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ మినహా బీజేపీ రన్నరప్‌గా నిలిచిందని రాజేందర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందన్న రేవంత్ రెడ్డి.. గెలవకపోవడంపై సమాధానం చెప్పాలని మహబూబ్ నగర్ నుంచి ఎంపీ ఎన్నికైన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి బాధ్యత వహిస్తూ రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్‌లో ముఖ్యమంత్రి కాంగ్రెస్ అభ్యర్థిగా వ్యవహరించారని.. కాంగ్రెస్ ఓడిపోతే నియోజకవర్గంలో అభివృద్ధి జరగదని ప్రజలను హెచ్చరించే స్థాయికి వెళ్లారని ఆమె అన్నారు. బీజేపీ 10 సీట్లు గెలుచుకుంటుందని భావించినా.. ఎనిమిది స్థానాలకే పరిమితమైందని అరుణ అన్నారు.