ఎన్నికేదైనా గెలుద్దాం..

BJP National Executive Meet Updates.కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం గ‌త ఎనిమిదేళ్లుగా చేప‌ట్టిన సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 July 2022 4:28 AM GMT
ఎన్నికేదైనా గెలుద్దాం..

కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం గ‌త ఎనిమిదేళ్లుగా చేప‌ట్టిన సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను, విప‌క్షాల విధ్వంస‌క‌ర విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంతో పాటు రానున్న ఎన్నిక‌ల‌పై మ‌రింత దృష్టి పెట్టాల‌ని బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గం నిర్ణ‌యించింది. హైద‌రాబాద్‌లోని హెచ్ఐసీసీలో శ‌నివారం బీజేపీ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌హా కేంద్ర‌మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, మాజీ ముఖ్య‌మంత్రులు, పార్టీ కార్య‌ద‌ర్శులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ప్రారంభ‌మైన కార్య‌వ‌ర్గ స‌మావేశం రాత్రి ఎనిమిదిన్న‌ర గంట‌ల‌కు వ‌ర‌కు జ‌రిగింది.

క‌ర్ణాట‌క‌, గుజ‌రాత్‌, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, మ‌రికొన్ని రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఎలాంటి వ్యూహాలు అనుస‌రించాల‌న్న దానితో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి కీలక అంశాలపై ఈ స‌మావేశాల్లో చ‌ర్చించారు. అంత‌క‌ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్ర‌వేశ‌పెట్టిన రాజ‌కీయ తీర్మానంపై చ‌ర్చ జ‌రిగింది. అనంత‌రం ఆ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తర్వాత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆర్థిక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం కింద కేంద్ర ప్రభుత్వ పథకాలను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సుస్థిర అభివృద్ధి కొనసాగుతోందన్నారు.

పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో భారత్ లో కులతత్వ, బుజ్జగింపు రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకు అడ్డుకట్ట పడిందన్నారు. ఇప్పుడు అభివృద్ధి చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయన్నారు.

స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్య‌మంత్రి సీఎం కేసీఆర్ రాజకీయ మర్యాద మర్చిపోయారన్నారు. ఆయ‌న అవ‌మానించింది వ్య‌క్తిని కాద‌ని, ప్ర‌ధాని ప‌ద‌విని అని అన్నారు. దీంతో టీఆర్ఎస్ వైఖ‌రి ఎంటో స్ప‌ష్టంగా ప్ర‌జ‌లంద‌రికి అర్థం అవుతుంద‌ని తెలిపారు. కేసీఆర్ కుటుంబానికి, ఆయ‌న పార్టీకి రాజ‌కీయం అనేది ఓ సర్క‌స్ కావొచ్చున‌ని, అయితే.. మా పార్టీకి మాత్రం రాజ‌కీయం అనేది జాతి నిర్మాణ అంశం అని స్ప‌ష్టం చేశారు. మోదీ నేతృత్వంలో బలమైన దేశ నిర్మాణం జరుగుతోంది. విపక్షాల దురుద్దేశపూరిత రాజకీయాలు మా లక్ష్యాన్ని దెబ్బతీయలేవన్నారు.

బండి సంజ‌య్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే సీఎం కేసీఆర్ గడిని బద్దలుకొడతామ‌న్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో విచ్చలవిడితనం పెరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని తెలిపారు. డ్రగ్స్, మైనింగ్ మాఫియాలో తెలంగాణ పేరే మార్మోగుతోందని, క్రైమ్ రేటు పెరిగింద‌న్నారు. రాష్ట్రపతి ఎన్నికల గౌరవాన్ని దిగజార్చేలా కేసీఆర్‌ వ్యవహరించారని, ఇవేమీ పంచాయతీ ఎన్నికలు కావని టీఆర్ఎస్‌ గుర్తించాలన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై సీఎంగా ఎందుకు స్పందించట్లేదు అని ప్ర‌శ్నించారు. తెలంగాణలో రాబోయేది భాజపా పాలనేన‌ని బండి సంజ‌య్ ధీమా వ్య‌క్తం చేశారు.

Next Story