ప్రవళిక గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్న విషయం కేటీఆర్ దాస్తే దాగేది కాదు
దివంగత ప్రవళిక పరువు తీసేందుకు కేసీఆర్ పోలీసులను వాడుకుంటున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.
By Medi Samrat Published on 16 Oct 2023 5:19 PM ISTదివంగత ప్రవళిక పరువు తీసేందుకు కేసీఆర్ పోలీసులను వాడుకుంటున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కార్ దే అన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కేటీఆర్ వాదన ఉందని విమర్శించారు. ఆత్మహత్యకు వేరే కారణం ఉందంటే నిరుద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ.. లీకేజీలతో 30 లక్షల మందిని మోసం చేశారని మండిపడ్డారు.
ప్రవళికగా గ్రూప్-4 రాసి గ్రూప్-1,2 కోసం ప్రిపేర్ అవుతున్న విషయం కేటీఆర్ దాస్తే దాగేది కాదని అన్నారు. మీ చేతగాని తనం కోసం చనిపోయిన అమాయక అమ్మాయి మీద నెపం నెట్టడం మరింత దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్కశంగా ఒక కుటుంబాన్ని అబాసు, అప్రతిష్ఠ పాలు చేయడం కరెక్టేనా? అని ప్రశ్నించారు. మానవత్వం ఉన్న ఎవరూ కేటీఆర్ లా వ్యవహరించరు, మాట్లాడరని ఫైర్ అయ్యారు.
ఒక్క పోటీ పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించని చరిత్ర మీదని.. 3016 నిరుద్యోగ భృతి ఇస్తా అని మోసం చేసింది మీరు అని మండిపడ్డారు. పేదలు చదివే బడులు మూత పడుతున్నాయి. పిల్లల భవిష్యత్ పై తల్లిదండ్రుల ఆందోళన బాగా పెరిగిందన్నారు. ఆ కుటుంబంతో పాటు నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. విచారణ కాకముందే.. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే డీసీపీ ఎలా తీర్పు ఇస్తారు అని ప్రశ్నించారు. చర్యలు తీసుకోవాల్సింది డీసీపీ మీద.. సీఐ మీద కాదన్నారు.