రేవంత్‌కు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.

By Knakam Karthik
Published on : 1 May 2025 1:30 PM IST

Telangana, Hyderabad News, Cm Revanthreddy, Bjp MP Lakshman, Caste Census

రేవంత్‌కు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన తప్పుల తడక. కేంద్ర కేబినెట్‌లో మోడీ ఒక చారిత్రత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. జన గణనతో పాటు, కులగణన చేపడతామని ప్రకటించడం చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ప్రధాని మోడీ చేపట్టే కులగణన దేశానికి దిక్సూచిగా నిలుస్తోంది. యావత్ దేశం ప్రధాని మోడీని అభినవ అంబేద్కర్‌ అంటూ కొనియాడుతున్నారు. కులగణనపై రాహుల్‌గాంధీ, రేవంత్ రెడ్డిలు మొసలి కన్నీరు కారుస్తున్నారు..అని లక్ష్మణ్‌ ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి కొత్త. రేవంత్ రెడ్డిలో కాంగ్రెస్ డీఎన్‌ఏ లేదు. 60 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీఈ కులగణన ఎందుకు చేపట్టలేకపోయింది? మండలి కమిషన్ సిఫార్సులు చెత్తబుట్టలో వేసిన నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలది. నాటి నుంచి నేటి వరకు ఓబీసీలకు కాంగ్రెస్ విరోధిగానే ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల కారణంగా కులగణన సర్వే రిపోర్టు బయటపెట్టలేదు. తెలంగాణ దేశానికి రోల్ మోడల్ ఎట్లా అవుతుంది? తెలంగాణ రోల్ మోడల్ అయితే రాష్ట్రంలో కులగణన రిపోర్టును పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టలేదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.

తెలంగాణలో 12 శాతం ఉన్న ముస్లింలలో 10 శాతం ఓబీసీ ముస్లింలు ఉన్నారని మసి పూసి మారేడు కాయ చేస్తున్నారు. కులగణనపై 2018లోనే రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంగా చెప్పారు. కులగణన రాహుల్ గాంధీ కోసమో, రేవంత్ రెడ్డి కోసమో చేయడం లేదు. మోడీ నేతృత్వంలో న్యాయపరంగా, నీతివంతంగా కులగణన జరుగుతుంది...అని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.

Next Story