గవర్నర్ ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకంటే.?

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని కలిశారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ నియామకంపై

By Medi Samrat  Published on  9 Dec 2023 11:13 AM GMT
గవర్నర్ ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకంటే.?

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని కలిశారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ నియామకంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. సీనియర్లు ఉన్నప్పటికీ అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. ఈ క్రమంలో నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి బీజేపీ ఎమ్మెల్యేలు వినతి పత్రం అందించారు. ప్రభుత్వం సంప్రదాయం పాటించలేదని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన అక్బరుద్దీన్ ఒవైసీ ఎదుట ప్రమాణం చేయకూడదని బీజేపీ నిర్ణయించింది. అనుకున్నట్లుగానే బీజేపీ ఎమ్మెల్యేలు నేడు ప్రమాణస్వీకారం చేయలేదు.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశమే ఎక్కువగా ఉందని నేడు బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే మజ్లిస్ పార్టీని మచ్చిక చేసుకుంటోందని ఆరోపించారు. అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయడం వెనకున్న ఉద్దేశం ఇదేనని చెప్పారు. ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో శాసన సభ సంప్రదాయాన్ని కాలరాసిందన్నారు. సభలో సీనియర్లను పక్కన పెట్టి ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయడం కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని బయటపెడుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.

Next Story