హిందువుల పండగలకే ఆంక్షలు గుర్తుకు వస్తాయా అని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. హోలీ నేపథ్యంలో ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ.. హోలీ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోలీ సందర్భంగా గుంపులుగా తిరగవద్దని హైదరాబాద్ పోలీసులు రూల్స్ పెట్టడంపై సీరియస్ అయ్యారు. హిందువుల పండుగలు ఎలా చేసుకోవాలో మీరు చెప్తారా? హోలీ రోజు పోలీసులు, 9వ నిజాం రేవంత్ రెడ్డి ఆంక్షలు పెడతారా? అని విమర్శించారు.
నిజాం కాలంలో హిందువులు ఏ విధంగా పండుగలు జరుపుకోవాలో చెప్పారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధానాన్ని ఫాలో అవుతుందని ఆరోపించారు. హోలీ ఏ విధంగా జరుపుకోవాలో ఒక సందేశం ఇస్తే బాగుండేదని, కానీ ముస్లింలకు అనుకూలంగా నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని రాజాసింగ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ. హిందువుల పండుగలను అడ్డంకులు సృష్టించాలని చూస్తుంది..అని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.