హుజురాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిచిన సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఇది కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన ఘన విజయని అన్నారు. హుజురాబాద్ బైపోల్‌లో టీఆర్‌ఎస్ నాయకులు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, ప్రజలను వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను మభ్య పెట్టాలని చూశారన్నారు. చివరకు నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితిని కల్పించారని... అయినా కూడా ప్రజలు తన వైపు నిలబడ్డారని ఈటల అన్నారు. తాము దళిత కాలనీలకు వెళ్లినప్పుడు.. దళితబంధుకు లొంగిపోతామా బిడ్డా అని చెప్పారని, 10 లక్షలకు అమ్ముడుపోతామా బిడ్డా అని అన్నారు.
కులం విషయం తీసుకువచ్చినా ప్రజలు తనవైపే నిలబడ్డారని.. ఈ విజయం హుజురాబాద్ ప్రజలకు అంకితం అంటూ ఈటల మాట్లాడారు. హుజురాబాద్ ప్రజల రుణం తాను ఎన్నటికీ తీర్చుకోలేనని, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఈటల రాజేందర్ చెప్పారు. తనకు వచ్చిన కష్టం మరేవరికి రాకూడదని, కుట్రదారులు కుట్రలలోనే నాశనం అయిపోతారని అన్నారు. 2 గుంటల మనిషి 4 వందల కోట్ల డబ్బు ఎలా ఖర్చు పెట్టాడని ప్రశ్నించారు. కేసీఆర్ మొహంతో కంటే ఇప్పుడే ఎక్కువ ఓట్ల వచ్చాయని ఈటల అన్నారు. తనది చరిత్ర తెరిచిన పుస్తమని, తనకు అండగా నిలిచిన ప్రజలకు ఈటల కృతజ్ఞతలు తెలిపారు. గెలుపుకు కృషి చేసిన బీజేపీ నేతలకు, అండగా ఉన్న అమిత్ షాకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు ఈటల రాజేందర్.