డ్యామేజ్ కంట్రోల్ : కేంద్ర మంత్రిగా బండి సంజయ్
BJP might make Bandi Union Minister; Kishen Reddy may lead party in TS polls. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 July 2023 10:25 PM ISTతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో భారతీయ జనతా పార్టీలో చీలిక వచ్చేసింది. తెలంగాణ బీజేపీ అగ్రనేతల మధ్య ఏ మాత్రం సఖ్యత లేదంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం సాగుతూ ఉండగా.. అది నిజమేనని తేలింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు కేంద్ర రాష్ట్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డికి తెలంగాణ బీజేపీ నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందని అంటున్నారు.
బండి సంజయ్ కు కీలక పదవి దక్కడానికి కారణం ఆయన అధికార BRS ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకి వ్యతిరేకంగా చేసిన పోరాటానికి కాదు. తెలంగాణ బీజేపీలో వచ్చిన విబేధాలను తొలగించడానికి చేస్తున్న డ్యామేజ్ కంట్రోల్ అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీజేపీ మరీ పాతాళంలోకి వెళ్లిపోకుండా చేయడానికి ఈ వ్యూహాత్మక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి.
మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, ఆయన సన్నిహితులు బండి సంజయ్ పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్నారని, తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని మార్చాలని డిమాండ్ చేశారని సంబంధిత వర్గాలు న్యూస్‌మీటర్‌కి తెలిపాయి. ఈటెల బృందంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ డీకే అరుణ, కొత్తగా చేరిన రాజగోపాల్ రెడ్డి, వారి మద్దతుదారులు ఉన్నారు. ఏడాది కాలంగా వీరి మధ్య అభిప్రాయబేధాలు ఉన్నాయని అంటున్నారు.
న్యూస్‌మీటర్‌తో మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత రామచంద్రరావు మాట్లాడుతూ, “ఈగోలు, కలుపుకుని పోయే తత్వాలు లేకపోవడంతో ఈ గొడవలు అని తేలింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ వ్యవహరిస్తున్న తీరుపై ఈటెల రాజేందర్ బృందం అసంతృప్తిగా ఉన్నారు. సమావేశాలు నిర్వహించే ముందు ఆయన సీనియర్ నేతలను సంప్రదించరు, పార్టీ నిర్ణయాలు కూడా స్వయంగా తీసుకోరు. చాలా ఏళ్లుగా పార్టీని అట్టిపెట్టుకుని ఉన్న సీనియర్లను కూడా వదిలేస్తున్నారు. ఏడాది కాలంగా హైకమాండ్ కి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే ప్రతిపాదన ముందుకు వచ్చింది. గతంలో సంజయ్ స్థానంలో ఈటెల ఎంపికపై ప్రతిపాదన వచ్చింది. అందుకు పార్టీ ఒప్పుకోలేదు. ఈటెల సీనియర్ నాయకుడయినా.. పార్టీలోకి కొత్తవాడే కాబట్టి, ఆయనకు పదవి అప్పగించడం సీనియర్లకు నిరాశకు గురిచేస్తుంది." అని అన్నారు.
రాష్ట్రంలో పార్టీని ముందుకు నడిపించేందుకు మంత్రి కిషన్‌రెడ్డి, సీనియర్ నేత డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు తెరపైకి వచ్చాయి. “కిషన్ రెడ్డి పేరుని పరిగణించినప్పటికీ, ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ఆయన ఈ బాధ్యతలను తీసుకోవడానికి ఆయన ఆసక్తి చూపడం లేదు. కిషన్ రెడ్డి ఈ ప్రతిపాదనపై పెద్దగా ఆసక్తి చూపలేదు, ” అని ఒక మూలం తెలిపింది.
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎంపీ వివేక్, గుండె విజయ రామారావుల మద్దతు బండి సంజయ్ కు ఉన్నాయి. వాళ్లే కాకుండా మరికొందరు బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ చీఫ్ గా కొనసాగించాలని కోరుతున్నారు. బీజేపీలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు పెద్ద వరంలా మారాయి. బీజేపీలో విబేధాలు విపక్షాలకు అస్త్రంలా మారాయి.
తెలంగాణలో బీజేపీ చీఫ్ మార్పుకు సంబంధించి హైకమాండ్ సామాజిక సమీకరణాన్ని కూడా పరిశీలిస్తుంది. అది రెడ్డి లేదా ఇతర వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తినా? అనే విషయంపై కూడా హై కమాండ్ దృష్టి పెట్టింది. ‘‘ఈటెల అధ్యక్షుడిగా ఉండేందుకు గతంలో లాబీయింగ్ చేశారు. అయితే, దీనిపై పార్టీ దృష్టి పెట్టలేదు. తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి ఎంతో బాధ్యతతో కూడుకున్నది కాబట్టి, ఈ నిర్ణయం అధిష్టానానికి ఖచ్చితంగా కఠినమైనదే” అని రామచంద్రరావు అన్నారు.
ఎన్నికల ప్రచార సారధిగా ఈటెల?
బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం.. తెలంగాణలో బీజేపీ పార్టీ తన పునాదిని బలోపేతం చేసుకోవాలని కోరుకుంటోంది. రాజేందర్‌ను ప్రజలకు మరింత చేరువ చేయాలని భావిస్తూ ఉన్నారు. బీజేపీ ఎన్నికల సంఘంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పార్టీకి మార్గనిర్దేశం చేసే వ్యక్తిగా ఉండనున్నారు. ఈ ఉత్తర్వులు మరో రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ఈటెల రాజేందర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ సీనియర్ నేతలను కలవడానికి ఢిల్లీకి పిలిచిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనేది వారి చర్చలోని ప్రధానాంశం. తెలంగాణపై ప్రభావం చూపే అంశాలపై కేంద్ర బీజేపీ బృందానికి ఈటెల ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉన్నారు.