ఆగస్టు 21న మునుగోడులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభకు బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మునుగోడులోని బహిరంగ సభా వేదికను వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహా బీజేపీ సీనియర్ నేతలు సందర్శించి సీటింగ్, పార్కింగ్, హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై స్థానిక కేడర్, అధికారులకు సూచనలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అధికారికంగా పార్టీలో చేరే సభకు బీజేపీ భారీగా జనాన్ని సమీకరించాలని యోచిస్తోంది.
అమిత్ షా మునుగోడు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మీడియాకు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. అమిత్ షా ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 3.40 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు నల్గొండ జిల్లా మునుగోడుకు బయలుదేరి వెళతారు. సాయంత్రం 4.35 గంటలకు మునుగోడులో సీఆర్పీఎఫ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4:40 నుంచి 6:00 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.
సమావేశం అనంతరం రోడ్డు మార్గంలో రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లనున్నారు. అమిత్ షా సాయంత్రం 6:45 నుంచి 7:30 వరకు ఫిల్మ్ సిటీలో ఉంటారు. శంషాబాద్‌లోని నోవాటెల్‌లో రాత్రి 8:00 గంటల నుంచి 9:30 గంటల వరకు పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. రాత్రి 9.40 గంటలకు ఆయన తిరిగి న్యూఢిల్లీకి చేరుకుంటారు. అమిత్ షా తన పర్యటన సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించిన పలు బాధ్యతలను బీజేపీ నేతలకు అప్పగించే అవకాశం ఉంది.