బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ను కలిసింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిచ్చి, తగిన భద్రత కల్పించేలా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని కోరుతూ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు. నిన్న (ఆగస్టు 22న) హైదరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు జరిపిన దాడిపై విచారణ జరిపించేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ రోజు జనగాంలో ప్రజా సంగ్రామ యాత్రపై దాడికి కుట్ర పన్నిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన ఘటనపై విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరారు. బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టు, యాత్ర అడ్డగింతకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
టీఆర్ఎస్ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై యాత్ర చేస్తున్న బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్ రెచ్చగొట్టేందుకు ఎంతలా ప్రయత్నించినా, బిజెపి కార్యకర్తలు సంయమనం పాటించారని గవర్నర్‌కు వివరించారు. గవర్నర్ ను కలిసిన వారిలో ఎంపీ డా.లక్ష్మణ్, విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి,రఘునందన్ రావు, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు.