బీజేపీ నాయకులు ఈటల రాజేందర్, రాజాసింగ్ గృహనిర్భందం
BJP leaders Etela Rajender and Raja Singh house Arrest.హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను
By తోట వంశీ కుమార్
హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పోలీసులు గృహనిర్భందం చేశారు. ఇటీవల రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ కార్యకర్తలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే.. పలు చోట్ల ఈ కార్యక్రమాల్లో ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా జనగామ ప్రధాన కూడలిలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. కాగా.. బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులను నిరసిస్తూ.. నేడు(గురువారం) బీజేపీ మౌనదీక్షకు పిలుపునిచ్చింది.
గాయపడిన వారిని పరామర్శించేందుకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్, గోశామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌లు జనగామ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరిని పోలీసులు గృహనిర్భందం చేశారు. దీనిపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అందరికి సమాన హక్కులు ఉంటాయన్నారు. ధర్నాలు చేయడానికి ఒక్క టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే అనుమతులుంటాయా అని ప్రశ్నించారు. దెబ్బలు తిన్న వారిపై కేసులు పెడుతున్నారని ఈటల మండిపడ్డారు. గాయపడిన వారికి ధైర్యం చెప్పే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రశ్నించారు. దాడులు చేసిన వారి పక్షాన పోలీసులు నిలుస్తారా అని నిలదీశారు. ప్రజా స్వామ్యం అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఒక్క టీఆర్ఎస్‌కేనా.. ప్రజా సంఘాలు, ఇతర పార్టీలకు మాట్లాడే అధికారం, నిరసన తెలిపే అధికారం లేదా అని మండిపడ్డారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ వచ్చిందన్నారు. గోశామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. కార్యకర్తలను పరామర్శించేందుకే జనగామ వెళ్లాలని అనుకున్నానని పోలీసుల తీరు సరిగా లేదన్నారు.