బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు ఆలోచన ఆత్మహత్య సదృశ్యమేనని మాజీమంత్రి, బీజేపీ నేత విజయరామారావు అన్నారు. బండి సంజయ్ ను మార్చితే బీజేపీలో చేరికలు కాదు.. ఉన్న వారు బయటకు పోవటం ఖాయం అని అన్నారు. అధ్యక్షుడిగా బండి సంజయ్ కంటే బలమైన నేత బీజేపీలో లేరని అన్నారు. జంట నగరాలకే పరిమితమైన బీజేపీని గ్రామగ్రామానికి తీసుకెళ్లిన ఘనత బండి సంజయ్‌దేనన్నారు. బండి సంజయ్ మాదిరి పార్టీ కోసం శ్రమించే బలమైన నేత బీజేపీలో లేరని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ను ఎదుర్కోవడానికి బండి సంజయ్ చాలని.. స్వయంగా మోదీ, అమిత్ షాలు బహిరంగ సభలలో చెప్పారని గుర్తుచేశారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్న అనుమానం ప్రజల్లో ఉన్నమాట వాస్తవమన్నారు. కాళేశ్వం ప్రాజెక్ట్ కేసీఆర్ కు ఏటీఎం లా మారిందన్న మా జాతీయ నేతలు.. చర్యలు మాత్రం తీసుకోలేదన్నారు. బండి సంజయ్ ను మార్చాలనే ఆలోచన ఉంటే హైకమాండ్ పునరాలోంచించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పట్ల బీజేపీ అప్రోచ్ మారితే ప్రజలు అనుమానించాల్సి వస్తదని అన్నారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను బీజేపీలో కొనసాగుతానని స్ఫష్టం చేశారు.