తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ తిరుగులేని పార్టీగా ఎదిగింది. వాస్తవానికి ప్రతిపక్ష హూదాలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా ముఖ్యనేతలు చాలా మంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం తెలిసిందే. కానీ ఇప్పుడు తెలంగాణలో తీరు మారింది.. గత కొంత కాలంగా బీజేపీ ఇక్కడ సత్తా చాటుతుంది. ఇటీవల ఎంపీ ఎలక్షన్స్, దుబ్బాక ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు బిజెపికి బూస్ట్ లా పనిచేస్తున్నాయి.
ప్రస్తుతం భవిష్యత్ ఎన్నికల్లో కూడా విజయం సాధించేలా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. రానున్న ఎన్నికలలో కూడా కాషాయ జెండాను ఎగురవేసి, 2023 లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో బీజేపీ శ్రేణులు పని చేస్తున్నాయి. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు బండి సంజయ్.
తాజాగా సూర్యాపేట జిల్లాలోని గుర్రంపోడు తండాలో తమ భూములు కబ్జాకు గురయ్యాయంటూ గత కొంతకాలంగా పలువురు గిరిజనులు ఆందోళన చేపడుతున్నారు. ఈ వ్యవహారంలో వాస్తవాలను తెలుసుకునేందుకు బీజేపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో బిజేపి బృందం గుర్రంపోడుతండాకు బయలుదేరింది.
సంజయ్‌తో పాటు కమలం నేతలు విజయశాంతి, ఎమ్మెల్యే రాజాసింగ్, వివేక్, జితేందర్‌రెడ్డి, విజయరామారావు, రవీంద్రనాయక్, స్వామిగౌడ్ ర్యాలీగా వెళ్లారు. గిరిజనుల భూములను పరిశీలించిన బీజేపి బృందం... గిరిజనుల ఆందోళనపై వారితో మాట్లాడింది. బాధితులకు అండగా ఉండి న్యాయం చేస్తామని కాషాయ నేతలు హామీ ఇచ్చారు.