బీజేపీ.. భారతీయ ఝూటా పార్టీ : హరీశ్ రావు
BJP is Bhartiya Jhuta Party. బీజేపీని భారతీయ ఝూటా పార్టీగా అభివర్ణించారు ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్ రావు.
By Medi Samrat Published on 16 Jan 2022 2:40 PM GMTబీజేపీని భారతీయ ఝూటా పార్టీగా అభివర్ణించారు ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్ రావు. ఆదివారం నాడు సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని గుర్రాలగొంది గ్రామంలో పలువురు బీజేపీ నాయకులు టీఆర్ఎస్‌లో చేరారు. బీజేపీ మండల పార్టీ నాయకుడు బోయిని ఎల్లం, జిల్లా నాయకుడు పటేండ్ల రాజం, పిట్ల సురేష్, సూరగోని మహేష్ తదితరులు హరీశ్ రావు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి హరీశ్ రావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక అంశాల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందన్నారు.
"బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకురావడం ద్వారా రైతులను సంక్షోభంలోకి నెట్టివేసింది.. అది ఎరువుల ధరలను ప్రభావితం చేసింది.. తద్వారా రైతులపై భారం పడుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా, 24×7 ఉచిత విద్యుత్ సరఫరా, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచిందని అన్నారు. అంతేకాక వ్యవసాయానికి సరిపడా సాగునీరు అందించడం వంటి అనేక రైతు సంక్షమ కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు. కేంద్రం కేవలం రైతులను మాత్రమే ఇబ్బందులకు గురి చేస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, అయితే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో వేలాది మంది నిరుద్యోగులుగా మారారని హరీశ్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా కాకుండా, తెలంగాణ ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లను జారీ చేయడం ద్వారా.. ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా తన వాగ్దానాలను నిలబెట్టుకుంటుందని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుకోవడంలో కూడా టీఆర్‌ఎస్ ముందున్నందున.. ప్రజలంతా టీఆర్‌ఎస్‌తోనే ఉండాలని పిలుపునిచ్చారని హరీష్ రావు అన్నారు.