'మిషన్ 90' కింద.. 10 వేల గ్రామ సభలను ప్లాన్ చేసిన బీజేపీ

BJP has planned 10 thousand Gram Sabhas in Telangana under 'Mission 90'. హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న

By అంజి  Published on  4 Jan 2023 3:21 PM IST
మిషన్ 90 కింద.. 10 వేల గ్రామ సభలను ప్లాన్ చేసిన బీజేపీ

హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ 'మిషన్ 90' కింద ఏప్రిల్‌లోపు 10,000 గ్రామస్థాయి సమావేశాలతో సహా పలు కార్యక్రమాలను ప్రారంభించనుందని బీజేపీ సీనియర్ నాయకుడు కె. లక్ష్మణ్‌ బుధవారం తెలిపారు. 'మిషన్ 90' కింద తెలంగాణలో 119 మంది సభ్యుల అసెంబ్లీ సభలో బీజేపీ 90 సీట్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల జరిగిన పార్లమెంటరీ 'విస్తారక్' సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ హాజరైన సమావేశంలో ఈ మిషన్‌ను నిర్ణయించినట్లు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ చెప్పారు.

''సంక్రాంతి పండుగ (జనవరి 15) తర్వాత ప్రారంభమయ్యే.. మిషన్ 90లో భాగంగా, 'కేసీఆర్ కో హటావో, తెలంగాణ కో బచావో' నినాదంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అవినీతి, కుటుంబ పాలనను ఎత్తిచూపుతూ 10,000 గ్రామాలకు చేరుకోవడం బీజేపీ లక్ష్యం'' అని లక్ష్మణ్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో చేపడుతున్న అభివృద్ధి పనులు, వివిధ పథకాలను కూడా ఈ సమావేశంలో హైలైట్ చేస్తారని, రెండవ రౌండ్ కార్యక్రమాలలో ఇదే విధమైన ప్రచారంతో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీ బహిరంగ సభలు ఉంటాయని ఆయన అన్నారు.

ప్రతి (అవిభజిత) జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో కూడా బహిరంగ సభలు నిర్వహించబడతాయి. చివరకు మొత్తం కార్యక్రమాన్ని ముగించడానికి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏప్రిల్‌లో భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలకు వ్యతిరేకంగా అమిత్ షా 'ఛార్జ్ షీట్' విడుదల చేస్తారని బీజేపీ నేత అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జనవరి 7న మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్‌లకు చెందిన పార్టీ బూత్ స్థాయి కమిటీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఎన్నికలకు ముందు వారికి దిశానిర్దేశం చేసేందుకు ఏప్రిల్‌లో దాదాపు రెండు లక్షల మంది పార్టీ కార్యకర్తలతో ప్రధాని నేతృత్వంలో సమావేశం నిర్వహించాలని పార్టీ యోచిస్తోందని లక్ష్మణ్ చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో తన అడుగుజాడలను విస్తరించాలనే లక్ష్యంతో బీజేపీ గత ఏడాది జూలైలో హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గాన్ని నిర్వహించింది. జాతీయ కార్యవర్గం ముగిసిన తర్వాత జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

తెలంగాణ ప్రజలు 'డబుల్ ఇంజన్ గ్రోత్' కోసం తహతహలాడుతున్నారని, అది బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడే నెరవేరుతుందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని, గత రెండేళ్లలో జరిగిన రెండు అసెంబ్లీ ఉపఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికలలో కాషాయ పార్టీ సహేతుకమైన విజయాన్ని సాధించిందన్నారు. మోదీ, ఇటీవల నగరానికి వచ్చిన సందర్భంగా.. తెలంగాణ ప్రజలు ద్రోహానికి గురవుతున్నారని ఆరోపిస్తూ అధికార బీఆర్‌ఎస్‌ను చీల్చిచెండాడారు. రాష్ట్రంలో ప్రతిచోటా 'కమలం వికసిస్తుంది' అని నొక్కి చెప్పారు.

Next Story