తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అని కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా పెద్ద గుడ్డును గాంధీ భవన్లో ఏర్పాటు చేసింది. తెలంగాణ అడిగినవి ఇవి అంటూ ''పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మేడారం సమ్మక్క - సారలక్క జాతరకు జాతీయో హోదా, బడ్జెట్లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా, 811 టీఎంసీ కృష్ణా జలాలలో సరైన వాటా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, స్టార్ట్ సిటీలుగా వరంగల్, కరీంనగర్, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కనీసం ఒక్క త్రిబుల్ ఐటీ, మెడికల్ కాలేజీ, కనీసం ఒక్క ఐఐఎమ్' వంటి పలు అంశాలతో ఫ్లెక్సీని ప్రదర్శించింది.
చివరికి బీజేపీ ఇచ్చింది 'గాడిద గుడ్డు' అంటూ ఓ పెద్ద గుడ్డును పెట్టింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు తప్ప మరేం లేదని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. తెలంగాణ పట్ల బీజేపీ చూపిస్తున్న వివక్షకు నిరసనగా ఈ వినూత్న కార్యక్రమం చేపట్టామన్నారు. కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలని బల్మూరి వెంటక్ డిమాండ్ చేశారు.