తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ హస్తం ఉందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఇందులో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేతలు ఎంతో కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ చేసినట్లుగానే నేడు యాదాద్రిలో ప్రమాణం చేశారు. ఆయన యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ప్రమాణం చేశారు. ఆలయ స్నానఘట్టంలో స్నానమాచరించి... తడిబట్టలతోనే లక్ష్మీనరసింహ స్వామి వారి పాదాల వద్దకు చేరి ప్రమాణం చేశారు. స్వామి వారి పాదాల దగ్గర బండి సంజయ్ ప్రమాణం చేశారు. ఫామ్ హౌస్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని తాను యాదాద్రిలో ప్రమాణం చేస్తానని.. సీఎం కేసీఆర్ కు దమ్ముంటే ఆయన కూడా వచ్చి ప్రమాణం చేయాలని పిలుపునిచ్చారు.
చెప్పినట్లుగా శుక్రవారం బండి సంజయ్ యాదాద్రి బయలుదేరారు. బండి సంజయ్ కంటే ముందే యాదాద్రి చేరిన టీఆర్ఎస్ శ్రేణులు అక్కడ వెలసిన బీజేపీ జెండాలను చించేశాయి. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తాను యాదాద్రి వెళ్లి తీరతానని చెప్పిన సంజయ్.. శుక్రవారం మధ్యాహ్నానికి యాదాద్రి చేరుకున్నారు.. ప్రమాణం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు విజ్ఞప్తి చేశారు. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే ఉంటారని.. దొంగల మాటలను టీఆర్‌ఎస్ శ్రేణులు పట్టించుకోవద్దని సూచించారు.