హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఈ నెల 7న మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బీజేపీ బైక్ యాత్రలు చేపట్టునున్నట్టు తెలిపారు. 10వ తేదీన బూత్ కమిటీ సభ్యులతో బండి సంజయ్ ఆధ్వర్యంలో మీటింగ్ జరుగనున్నట్లు వెల్లడించారు. 189 గ్రామాల్లో జరుగనున్న బైక్ యాత్రల్లో స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల ఇంచార్జ్ లు, ముఖ్య నేతలు పాల్గొంటారని పేర్కొన్నారు.
బూత్ కమిటీలను వెంటనే పూర్తి చేయాలని బన్సల్ సూచించారని వివరించారు. టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో నకిలీ ఓటర్లను నమోదు చేయిస్తోందని ఆరోపించారు. ఓటర్ లిస్టును వెరిఫికేషన్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కేసీఆర్ అవినీతి, అసమర్థ పాలనను గ్రామ గ్రామాన వివరించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రచారం ఎలా చేయాలి.. ప్రజల్లోకి బీజేపీ గుర్తును ఎలా తీసుకెళ్ళాలనే అంశంపై చర్చించామని తెలిపారు. అక్రమ కేసులను ఎదుర్కొంటోన్న బీజేపీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.