ఎన్నికల వరకే రాజకీయాలు.. తర్వాత అభివృద్ధిపై దృష్టి: బండి సంజయ్
తాజాగా తనని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవడంపై బండి సంజయ్ స్పందించారు.
By Srikanth Gundamalla
ఎన్నికల వరకే రాజకీయాలు.. తర్వాత అభివృద్ధిపై దృష్టి: బండి సంజయ్
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. మిత్రపక్షాల సహకారంతో మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. అయితే.. తెలంగాణలో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 8 స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. కిషన్‌రెడ్డితో పాటు.. బండి సంజయ్ కూడా ఈ సారి కేంద్రమంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు.
తాజాగా తనని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవడంపై బండి సంజయ్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు.. కరీంనగర్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పగించిన నరేంద్ర మోదీతో పాటు.. బీజేపీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఈ సందర్బంగా బండి సంజయ్ చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలు అనీ.. ఆ తర్వాత అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెడతామని చెప్పారు. కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు తీసురావడం కోసం పనిచేస్తానని బండి సంజయ్ చెప్పారు. తనని గెలిపించిన కరీంనగర్ ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు చెప్పారు.. కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు బండి సంజయ్.