కేటీఆర్ కు చేదు అనుభవం
Bitter experience for KTR. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ప్రభావమో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చినందుకో
By Medi Samrat
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ప్రభావమో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చినందుకో కానీ టీఆర్ఎస్ నాయకులు ఇకపై ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఉన్నారు. గల్లీ లీడర్ల నుండి బడా లీడర్ల వరకూ ఈ కొద్దిరోజుల్లోనే చాలా మార్పును చూపిస్తూ ఉన్నారట. ఎంతో మంది నేతలు ప్రజలను కలవడానికి వెళుతూ ఉన్నారు. సమస్యలను గురించి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎల్లారెడ్డిపేటలో మున్నూరు కాపు సంఘ భవనాన్ని ప్రారంభించి, కార్యకర్త వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న మంత్రి కేటీఆర్‌ను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. డిగ్రీ కళాశాల కావాలని మంత్రి కాన్వాయిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహంతో నలుగురు బీజేపీ కార్యకర్తలపై దాడిచేసి, ఓ బైకును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సాయికుమార్ అనే బీజేపీ కార్యకర్త గాయపడగా, ఇరువర్గాల ఆందోళనలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పార్టీకి సంబంధం లేని మైనార్టీ యువకుడిపై మంత్రి సమక్షంలోనే టిఆర్ఎస్ గుండాలు దాడి చేశారని, దాడికి మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్న నాయకులకు ఇలా చేదు అనుభవాలు ఎదురవుతూ ఉన్నాయి.