Bijapur Encounter : 18కి చేరిన మృతుల సంఖ్య‌

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులు మరణించారు.

By -  Medi Samrat
Published on : 4 Dec 2025 6:50 PM IST

Bijapur Encounter : 18కి చేరిన మృతుల సంఖ్య‌

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులు మరణించారు. ఈ భీకర కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా వీరమరణం పొందారు. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశ్‌కుతుల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్), సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండోలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు దీటుగా స్పందించాయి. చాలా గంటల పాటు సాగిన ఈ పోరులో తొలుత 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ప్రకటించారు. గురువారం ఉదయం ఘటనా స్థలంలో జరిపిన గాలింపు చర్యల్లో మరో ఆరు మృతదేహాలు లభించడంతో మృతుల సంఖ్య 18కి చేరింది. ఈ పోరాటంలో డీఆర్‌జీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ మోను మోహన్ బడ్డి, కానిస్టేబుల్ డుకారు గోండే, జవాన్ రమేశ్ సోడీ కూడా మరణించారు. ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర సింగ్ మీనా తెలిపారు.

Next Story