కామారెడ్డిలో బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతలు

భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న కామారెడ్డిలో వేగంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి.

By అంజి  Published on  31 Oct 2023 5:42 AM GMT
Telangana Polls, BRS, Kamareddy,leaders, Congress

కామారెడ్డిలో బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతలు

భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న కామారెడ్డిలో వేగంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కామారెడ్డిలో ఇవాళ కేటీఆర్‌ పర్యటన వేళ.. బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియ బీఆర్‌ఎస్ పార్టీకీ రాజీనామా చేశారు. నిన్న ఆమె భర్త చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుండి అధిష్టానం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆమె ఇవాళ తన భర్తతో కలిసి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

పార్టీ నియమావళికి విరుద్ధంగా, క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు చంద్రశేఖర్‌ రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్టు కామారెడ్డి నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ పరిణామం బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డిలో ఉన్న గ్రూపు రాజకీయాలకు ఈ సస్పెన్షన్ హెచ్చరికగా భావిస్తున్నారు. ఇకపై ఎవ్వరైనా పార్టీ తీరుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఇలాంటి చర్యలు తప్పవని పరోక్షంగా హెచ్చరికలు పార్టీ జారీ చేసింది.

ఈ క్రమంలో ఇందు ప్రియ కూడా బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. రాజీనామాను పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్‌కు అందజేశారు. బీఆర్‌ఎస్‌ను వీడిన ఇందు ప్రియ, ఆమె భర్త చంద్రశేఖర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దంపతులు ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ వంశీ, పలువురు యువకులు హస్తం కండువా కప్పుకున్నారు. వారిని రేవంత్‌ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.



Next Story