హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కత్తి కార్తీక ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. హరీశ్ రావు ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్తీక 2021లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి దుబ్బాక ఉపఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఉప ఎన్నికలో ఆమె డిపాజిట్ కోల్పోయారు. నోటా కంటే తక్కువ సీట్లు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ జోడయాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కత్తి కార్తీక పాదయాత్ర చేశారు. ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కత్తి కార్తీక తాజాగా బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆమెకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు... కత్తి కార్తీకకు సూచించారని తెలుస్తోంది. యాంకర్ కత్తి కార్తీక.. రేడియో జాకీ కూడా. ఆమె బిగ్ బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్నారు.