పెట్రోభారం మోదీ, కేసీఆర్ పాపమే
Bhatti Vikramarka Slams Modi KCR. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి దేశ ప్రజలను 40 ఏళ్లు వెనక్కు
By Medi Samrat Published on 7 March 2021 1:10 PM IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి దేశ ప్రజలను 40 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు. పెరుగుతున్న పెట్రోల్, జీడిల్ ధరలను నిరసిస్తూ భట్టి విక్రమార్క భద్రాచలంనుంచి సైకిల్ యాత్రను ఆదివారం ఆరంభించారు. ముందుగా భద్రాచల శ్రీ సీతారామ స్వామి వారి దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం ఆయన సైకిల్ యాత్రను ఆరంభించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు. పెట్రోల్, డీజిల్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్ వైఖరివల్ల దేశ ప్రజలు 40-50 ఏళ్లు వెనక్కి వెళ్లి.. మళ్లీ సైకిల్ వంటి ప్రయాణ సాధనాలే వాడే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజలపై మోయలేనంత పెట్రో భారాన్ని ప్రభుత్వాలు వేస్తున్నాయని అన్నారు. మోదీ, కేసీఆర్ లు పెట్రోల్, డీజిల్ పై ఎడాపెడా పన్నులు వేసి ధరల పెంచడంతో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని భట్టి అన్నారు.
లీటర్ పెట్రోల్ పై ప్రభుత్వాలు రూ. 58 రూపాయలు పన్నులు వేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రూ. 12 మాత్రమే పన్నులు ఉండేవని చెప్పారు. కాంగ్రెస్ పాలనాకాలంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగి.. దాదాపు బ్యారెల్ 138 డాలర్లకు చేరుకున్న సమయంలోనూ.. పెట్రోల్ లీటర్ కు 55, లీటర్ డీజిల్ రూ. 44కు ఉండేదని చెప్పారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు సగానికిపైగా తగ్గాలి.. కానీ పన్నుల పేరుతో ఈ ప్రభుత్వాలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని అన్నారు. మోదీ, కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, భారజలం, సింగరేణి వంటి సంస్థలను ప్రయివేటు పరం చేసి బడుగుబలహీన వర్గాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా మోదీ ప్రభుత్వం చేస్తోందని భట్టి అన్నారు.
త్వరలో జరగనున్న శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు అయిన రాములు నాయక్ ను గెలిపించాలని భట్టి విక్రమార్క విద్యావంతులకు పిలుపునిచ్చారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకుని అనేకమంది గ్యాడ్యుయేట్లుగా ఎదిగారని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో విద్యను ప్రవేటీకరణ చేసి సామాన్యులకు విద్యను అందని ద్రాక్షగా మార్చింది. విద్యను కార్పొరేటీకరణ చేయడంలో పల్లా రాజేశ్వర్ రెడ్డిది కీలక పాత్ర అని.. ఆయనకు ఓటేస్తే.. విద్య సామాన్యలకు అందదని చెప్పారు.