ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంపై వారిరువురు జాతికి సమాధానం చెప్పాలి

Bhatti Vikramarka Fires On PM Modi. దేశంలో ప్రజాస్వామ్యంపైనా పెద్ద ఎత్తున‌ దాడి జరుగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు

By Medi Samrat  Published on  20 July 2021 3:32 PM IST
ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంపై వారిరువురు జాతికి సమాధానం చెప్పాలి
దేశంలో ప్రజాస్వామ్యంపైనా పెద్ద ఎత్తున‌ దాడి జరుగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద విలేక‌రుల‌తో మాట్లాడిన ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో భావస్వేచ్ఛ, ప్రైవసీ లేకుండా పోతోందని.. దేశంలో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక సేవకుల ఫోన్లను బీజేపీ ట్యాప్ చేస్తోందని ఫైర్ అయ్యారు. ఫోన్ కాల్స్ ట్యాప్ చేస్తుండడంతో ప్రజాస్వామ్యానికి రక్షణ కరువైందని వాపోయారు.


పెగాసెస్ అనే స్పైవేర్ సాఫ్ట్ వేర్ ని ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తామని తయారీ సంస్థ ఎన్ఎస్ఓ చెబుతోందని.. అలాగే సాప్ట్‌వేర్‌ను ప్రయివేటు వ్యక్తులకు అమ్మలేదు.. ఇవ్వలేదని కూడా చెబుతోందని విక్ర‌మార్క అన్నారు. పెగాసెస్ స్పైవేర్ ద్వారా చాలామంది రాజకీయనాయకులు, జర్నలిస్టుల ఫోన్లు 2019 సాధారణ లోక్ సభ ఎన్నికలకు ముందునుంచి ట్యాప్ అయినట్లు సిటిజన్స్ ల్యాబ్ మంత్ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ టొరొంటో.. డీటైల్డ్ రిపోర్ట్ ను ఇచ్చిందని తెలిపారు.

ఈ రిపోర్ట్ లో దేశానికి చెందిన చాలామంది నాయకులు ఫోన్ ట్యాప్ అయినట్లు తేల్చిందని.. ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఫోన్ కూడా ట్యాప్ చేయడంతో పాటు, ఆయన కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఫోన్లను ట్యాప్ చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ చాలా ఆందోళనకరం.. ఇది భద్రతా సమస్యకు తెరలేపిందని విక్ర‌మార్క అన్నారు.

ఫోన్ ట్యాప్ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, హోమ్ మంత్రి అమిత్ షా జాతికి సమాధానం చెప్పాలని భ‌ట్టి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో, చట్టబద్దంగా, రాజ్యాంగ బద్దంగా గుర్తించిన ప్రతిపక్ష పార్టీల మనుగడకు సంబంధించి, వాటి భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగితే.. అది ప్రజాస్వామ్య మూల సిద్దాంతాలకు ప్రమాదం కలగటమేన‌ని అన్నారు. పెగాసెస్ ఫోన్ ట్యాపింగ్ పై ప్రధాని మోదీ మౌనం వీడి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

మీడియా సంస్థలపైనా పెగాసెస్ నిఘా పనిచేస్తోందని.. కేంద్రప్రభుత్వంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజకీయ నాయకుల ఫోన్లతోపాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. ఫోన్ల ట్యాపింగ్ తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ట్యాపింగ్ చేసే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి చెప్పాలని అన్నారు. రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ ను వ్యతిరేకిస్తూ.. ఈ నెల 22వ తేదీన ఇందిరాపార్కు నుంచి ఛ‌లో రాజ్ భవన్ కార్యక్రమం చేపడుతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.


Next Story