ఢిల్లీలో టీఆర్ఎస్‌ను బీజేపీలో కలిపే చర్చలు జరిగాయా.?

Bhatti Vikramarka Fires On KTR. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు హుజురాబాద్ ఎన్నికల్లో కలిసిపోయారని కేటీఆర్ మాట్లాడటం సరికాదని

By Medi Samrat  Published on  23 Oct 2021 7:17 PM IST
ఢిల్లీలో టీఆర్ఎస్‌ను బీజేపీలో కలిపే చర్చలు జరిగాయా.?

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు హుజురాబాద్ ఎన్నికల్లో కలిసిపోయారని కేటీఆర్ మాట్లాడటం సరికాదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేటీఆర్.. రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను ఆయ‌న‌ ఖండించారు. బీజేపీ మతతత్వ పార్టీ.. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ.. రెండు భిన్న ధృవాలు.. కేటీఆర్ కు రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. హుజురాబాద్ ఎన్నికల్లో ఓటమి భయంతో కేటీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. ఈటెలను గెలిపించడం కోసం కాంగ్రెస్ ఎందుకు పనిచేస్తుంది.. టీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు.

ఈటెల అవినీతిపై ప్రభుత్వం విచారణ ఎటుపోయింద‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు టీఆర్ఎస్ కు పట్టడం లేదని.. ఇప్పుడు హుజురాబాద్ లో టీఆర్ఎస్ మాయ మాటలు ప్ర‌జ‌లు నమ్మరని అన్నారు. హుజురాబాద్ ఎన్నికలలో బిజెపి, టీఆర్ఎస్ దోపిడీ దొంగలు గెలుపు కోసం పోటీపడుతున్నారని.. దోపిడీ దొంగల దోపిడీని అపాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ చేస్తున్న పోరాటాలకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూడలేకనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నార‌ని అన్నారు.

కేసీఆర్ ఢిల్లీ మంతనాలు ఏంటి.. టీఆర్ఎస్ ను బిజెపిలో కలిపే చర్చలు జరిగాయా అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ నాయకులపై బురదజల్లే మాట‌లు ప్రజలు నమ్మరని.. కేటీఆర్ ఇప్పటికైనా ఇలాంటి చౌకబారు ఆరోపణలు మానుకోవాలని హితువు ప‌లికారు. కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. గాంధీభవన్ లో గాడ్సే లు ఉండరు.. కాంగ్రెస్ భావజాలం ఉన్న వారే ఉంటారు.. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడటం సరికాదని.. కాంగ్రెస్ లో మాది నడవక కేటీఆర్ ది నడుస్తుందా.. కేటీఆర్ వి గాలి మాటలు అని అన్నారు.

ఎన్నికల తరువాత ఈటెల కాంగ్రెస్ లోకి వస్తారనడం ఊహాజనితం అని భ‌ట్టి వ్యాఖ్యానించారు. ధ‌ళిత బందుపై బిజెపి వైఖరి సరిగా లేదని.. ధ‌ళిత బందును ఆపడంలో బిజెపి, టీఆర్ఎస్ ల పాత్ర ఉంద‌ని ఆరోపించారు. ఇద్దరు దొంగలు కలిసే ధ‌ళిత బందును ఆపారని ఆరోపించారు. బల్ముర్ వెంకట్ బలమైన అభ్యర్థి.. కాదని ఎవరన్నా అంటే అది వారి అవగాహన రాహిత్యమ‌ని అన్నారు. హైద్రాబాద్ నిండా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు నింపారు.. ప్రతిపక్షాల ఫ్లెక్సీలు పెడితే హడావుడి చేసే అధికారులు.. ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్ర‌శ్నించారు.


Next Story