సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన భ‌ట్టి

Bhatti Vikramarka Fires On KCR. సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ పార్టీ ఖ‌మ్మంలో రైతు క‌వాతు

By Medi Samrat  Published on  28 Dec 2020 12:10 PM GMT
సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన భ‌ట్టి

ఖ‌మ్మం : సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ పార్టీ ఖ‌మ్మంలో రైతు క‌వాతు చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై సీఎల్పీ నేత భ‌ట్టి నిప్పులు చెరిగారు. ఈ సంద‌ర్భంగా భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. ఇప్పుడున్న స‌మ‌స్య చాలా గంభీర‌మైంద‌ని అన్నారు. ఈ దేశ ఆర్థిక ప‌రిస్థితికి వెన్నుముకైన వ్య‌వ‌సాయ రంగం అత్యంత క్లిష్ట‌ప‌రిస్థితుల్లో ఉంద‌న్నారు.

కాంగ్రెస్ పార్టీ జై జ‌వాన్‌.. జై కిసాన్ అంటూ దేశాన్ని ముందుకు న‌డిపింద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ 136 ఏళ్ల కింద‌ట ఈ రోజు ఆవిర్భ‌వించి.. దేశానికి స్వ‌తంత్రం తెచ్చింద‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. స్వ‌తంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రైతులు, వ్య‌వ‌సాయం బాగుండాల‌ని గ్రీన్ రెవ‌ల్యూష‌న్ తీసుకువ‌చ్చింద‌ని అన్నారు. రైతుల సంక్షేమం కోసం నాడు కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ ప‌థ‌కాలు తీసుకువ‌చ్చింద‌ని గుర్తు చేశారు. దేశానికి వెన్నుముక‌లాంటి రైతును నేడు ఇబ్బంది పెట్టేలా మోడీ స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రైతు పండించిన పంట‌ను, రైతుల జీవితాల‌ను ప్ర‌ధాన‌మంత్రి మోడీ, గుజ‌రాతీ వ్యాపార‌స్థుల చేతుల్లో పెడుతున్నార‌ని మండి పడ్డారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంద‌ని అన్నారు. వ్య‌వసాయం మొత్తం అంబానీ, అదానీ చేతుల్లోకి వెళితే.. రైతులు న‌డ్డివిరిగి.. చివ‌ర‌కు ఈ దేశం కూలిపోతుంద‌న్నారు. న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌ను నిర‌సిస్తూ.. కాంగ్రెస్ పార్టీ మ‌రో 18 పార్టీల‌ను క‌లుపుకుని.. పార్ల‌మెంట్ లో నిల‌దీసింద‌ని అన్నారు. దేశంలోని వ్య‌వ‌సాయ రంగాన్ని మోదీ వ్యాపార‌స్తుల చేతుల్లో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అన్నారు.

రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌ను వ్య‌తిరేకించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాలుగురోజులు కాక‌ముందే తోక‌ముడిచి ఢిల్లీవెళ్లి.. న‌రేంద్ర మోదీ ముందు మోక‌రిల్లార‌ని అన్నారు. అయ్యా.. నీకు దండం పెడ‌తా.. నీకు వ్య‌తిరేకంగా నేనేం చేయ‌ను అని మోదీముందు మోక‌రిల్లార‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. రైతులు పండించిన పంట‌ను మేము కొనం.. గ‌త ఏడాది కంటే రూ. 7500 కోట్లు న‌ష్టం వ‌చ్చింది.. మేము నిర్భంధ వ్య‌వ‌సాయాన్ని వెన‌క్కు తీసుకుంటున్నాం.. అని కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై భ‌ట్టి విక్ర‌మార్క నిప్పులు చెరిగారు. నిర్భంధ వ్య‌వ‌సాయాన్ని కేసీఆర్ వెన‌క్కు తీసుకోవ‌డం రైతుల విజ‌యంగా భ‌ట్టి అభివ‌ర్ణించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం ఉన్న‌దే రైతుల‌ను ర‌క్షించ‌డానికి.. ఆనాటి ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ ప్ర‌భుత్వాలు పంట‌ను కొన‌డాన్ని ఒక బాధ్య‌త‌గా తీసుకున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. అంతేకాక మినిమం స‌పోర్ట్ ప్రైస్ పేరుతో ద‌ళారుల నుంచి రైతుల‌ను ప్ర‌భుత్వాలు ఆదుకున్నాయ‌ని చెప్పారు.


Next Story
Share it